జగన్ తిరుగుబాటు, కుల సమీకరణాలు

పెద్దాయనగా భావించి రోశయ్యను ముఖ్యమంత్రిని చేసినా ఫలితం లేకుండా పోయింది. రెడ్లకు రెడ్లే విరుగుడు అన్నట్లుగా ఒక్కసారి కూడా మంత్రి పదవి చేయని కిరణ్ కుమార్ రెడ్డికి ఏకంగా ముఖ్యమంత్రి పదవిని అప్పగించి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడింది. అయితే, అది కూడా నామమాత్రంగానే ఫలితం ఇస్తోంది. ఈలోగా, కాపులను ప్రోత్సహించే పనిలో అధిష్టానం పడిందని అంటున్నారు. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత చిరంజీవి కాంగ్రెసులో ప్రధాన నాయకుడిగా మారిపోయారు. దీంతో కాంగ్రెసులో సమీకరణాలు మారే వాతావరణం చోటు చేసుకుంది.
వి. హనుమంతరావు, డి. శ్రీనివాస్ వంటి తెలంగాణ కాపులు, ఆంధ్ర కాపులతో దోస్తీ కట్టి రెడ్ల ప్రాబల్యాన్ని దెబ్బ తీసే కొత్త వ్యూహానికి కాంగ్రెసు అధిష్టానం తెర తీసింది. తెలంగాణ మున్నూరు కాపులు బిసిలు, ఆంధ్ర కాపులు ఎఫ్‌సిలు అయినా, ఈ రెండు సామాజిక వర్గాలు సమన్వయంతో పనిచేయడానికి సిద్ధపడినట్లే కనిపిస్తోంది. రెడ్ల ఆధిపత్యమే వారిని ఒక్కటి చేసిందనడంలో సందేహం లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అస్త్రాలు ఎక్కుపెట్టడంలో కూడా ఈ సామాజిక వర్గమే ముందుంటోంది. కాంగ్రెసులోని రెడ్డి సామాజిక వర్గం జగన్ పట్ల మెతక వైఖరితోనే ఉందనే భావన చోటు చేసుకుంది. ఏమైనా, రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి.
(ఈ వ్యాసంతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. రచయిత అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగు ఏకీభవించాల్సిన అవసరం లేదు)












Click it and Unblock the Notifications