ప్రమాదంలో వైయస్సార్ ఇమేజ్, వ్యూహాత్మకమే

వైయస్సార్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్ణయాల్లోని అవకతవకలను, అక్రమాలను వెలికి తీయడం ద్వారా తన వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం అమలు చేస్తున్నట్లు భావించవచ్చు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ కోట్లకు పడగలెత్తారనే అభిప్రాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం ఇందులో భాగమని చెబుతున్నారు. నిజానికి, కాంగ్రెసులో వైయస్ రాజశేఖర రెడ్డి విధానాలను, వైఖరిని తప్పు పట్టిన నాయకులు పెద్ద యెత్తునే ఉన్నారు. వి. హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి సీనియర్లు వైయస్సార్‌ను ఆయన బతికి ఉన్న కాలంలోనే తప్పు పట్టారు.
రాష్ట్రప్రభుత్వంలోని మంత్రులు, శానససభ్యులు మాత్రం వైయస్ రాజశేఖర రెడ్డిని తమ నాయకుడిగానే భావిస్తూ, వైయస్సార్ వారసత్వం తమదేనని ప్రకటించుకుంటూ వచ్చారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటివారు వైయస్ రాజశేఖర రెడ్డితో వైయస్ జగన్‌కు పోలిక లేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గానీ, సోనియాను గానీ ఏ రోజూ వ్యతిరేకించలేదని, ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పారని, జగన్ మాత్రం కాంగ్రెసును వ్యతిరేకిస్తున్నారని వాదిస్తూ వచ్చారు. అయితే, ఈ వాదన క్రమంగా కాంగ్రెసులో బలహీనపడే అవకాశం ఉంది.
వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తూ వస్తున్న వాదనకు బలం చేకూర్చే విధంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే, జగన్ వర్గం మాత్రం వైయస్ సెంటిమెంటును ఆధారం చేసుకుని ప్రజల సానుభూతిని పొందాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఆ ముఖ్య వాదనతోనే జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తమకు పనికి రానప్పుడు వైయస్సార్ ఇమేజ్‌ను సాధ్యమైనంత మేరకు దెబ్బ తీయడమే కాంగ్రెసు అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications