సోనియా అసంతృప్తి: గొంతుమార్చిన చిరంజీవి

తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేసి మరీ చిరంజీవి... కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. అంతేకాకుండా ఆయనకు ఇమేజ్ ఉంది. దీనిని గుర్తించిన కాంగ్రెసు ఆయనకు తొలి నుండి మంచి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పటి నుండి చిరంజీవి కాంగ్రెసుపై సూటిగా విమర్శలు చేసింది లేదు.
అయితే తాజా ఉప ఎన్నికల అనంతరం మాత్రం ఆయన 2014 సాధారణ ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాదేమో అనే భావన కాంగ్రెసు క్యాడర్‌లో ఉందని, అందుకే వారు కాంగ్రెసు అభ్యర్థులకు ఓట్లు వేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రాపురం, నరసాపురంలలో కూడా గెలిచింది గతంలోని పిఆర్పీ అభ్యర్థులేనని, వారు కాంగ్రెసును సమన్వయం చేసుకున్నారని చెప్పారు. మిగతా స్థానాలలోని నేతలు పిఆర్పీ వర్గాన్ని సమన్వయం చేసుకోలేదని ఆరోపించారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. విలీనం తర్వాత తొలిసారి చిరంజీవి పిఆర్పీని, కాంగ్రెసును వేరు చేసి మాట్లాడారనే విమర్శలు వచ్చాయి. కాంగ్రెసు నేతలు పలువురు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి నేతలైతే ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిరంజీవికి హితవు పలికారు. తన వ్యాఖ్యలపై ఇంత స్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ చిరంజీవి మాత్రం వాటిపై ఏమాత్రం స్పందించలేదు. ప్రచార సాధనాలలో వచ్చినప్పుడు పట్టించుకోక పోయినా ఫరవాలేదు. కానీ సొంత పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యలు సరికాదని చెప్పినప్పుడు కూడా ఆయన బయటకు వచ్చింది లేదు.
అయితే బుధవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ తర్వాత మాత్రం ఆయన గొంతు మార్చారు. తన వల్లే రెండు నియోజకవర్గాలలో గెలిచిందని చెప్పలేదని, సమన్వయం కావాలని మాత్రమే చెప్పానని, కాంగ్రెసు, పిఆర్పీ అంటూ వేరుగా మాట్లాడలేదని, అవన్నీ కల్పిత వార్తలని కొట్టి పారేశారు. తన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా స్పందించని చిరంజీవి నిన్న స్పందించడం వెనుక సోనియా అసంతృప్తియే కారణం కావొచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications