ఆత్మరక్షణలో దేవేందర్: ఎగిరిపడుతున్న సుజన

Sujana Chowdary - Devendar Goud
హైదరాబాద్: ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. తనను కొనే మొగోడున్నాడా అంటూ ఎగిరిపడిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ దాడి పెరిగే సరికి వెనక్కి తగ్గారు. మరో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాత్రం ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అందజేసిన తర్వాత ఆయన తనపై విమర్శలు చేస్తున్నవారిపై నిప్పులు చెరిగారు.

దేవేందర్ గౌడ్ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా మాత్రం ఆయన దూకుడుగా వ్యవహరించారు. తనపై విమర్శలు చేసినవారిపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పొరపాటుగానే జరిగినా తాను బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.. ఆదివారం తనను కలిసిన పలువురు సన్నిహితుల వద్ద దేవేందర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత అప్రతిష్టకు గురి కాలేదని, పార్టీని వీడి బయటకు వెళ్లినప్పుడు కూడా పార్టీ శ్రేణుల్లో ఇలాంటి మనోభావాలు తనపై వ్యక్తం కాలేదని, ఇప్పుడు అనుకోకుండా జరిగిన పొరపాటు తనను చిక్కుల్లో పడేసిందని ఆయన అంటున్నారట. తన ఆరోగ్యం ఎలా ఉన్నా.. ఢిల్లీలో రాజ్యసభలోనే ఉండడంతోపాటు మిగిలిన ఎంపీలు ఎక్కడున్నారో పర్యవేక్షించి ఉంటే ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆత్మావలోకనం చేసుకుంటున్నారని చెబుతున్నారు.

సుజనా చౌదరి మాత్రం తనపై విమర్శలు చేసినవారిదే తప్పన్నట్లుగా మాట్లాడారు. పార్టీలో ఒక్కొక్కరు ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని, రాజ్యసభ సభ్యుడంటే చిన్న పిల్లల వ్యవహారం కాదని, కాంగ్రెస్ అరాచకాలు చూడలేక అధికారంలో లేనప్పుడే తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ కోసం పని చేశానని ఆయన అన్నారు. తానేమిటో, నా తాహతు ఏమిటో తెలియక కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారని, తన కుటుంబ నేపథ్యం, వ్యాపారాలు, వ్యక్తిత్వం అందరికీ తెలుసునని, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో విభేదాలు వచ్చినప్పుడే లొంగలేదని ఆయన అన్నారు.

సుజనా చౌదరి తాను అందరికన్నా గొప్పవాడిననే పద్ధతిలో మాట్లాడారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయని అనుకున్నానని, పారిశ్రామికవేత్తగా 10 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న తన గురించి అందరికీ తెలుసునని ఆయన అన్నారు. వార్తలను కథలుగా అల్లే సంస్కృతి పోవాలని ఆయన మీడియాకు ఓ సలహా పారేశారు మీడియాలోని కొన్ని వర్గాలు ఇష్టానుసారం వార్తలు రాస్తున్నాయని, మీడియా సంస్థలు డ్రామా కంపెనీలు పెట్టుకోవడం మంచిదని ఆయన అన్నారు. తనది చిల్లర వ్యవహారాలు చేసే వ్యక్తిత్వం కాదని, రాజ్యసభ పదవి పార్టీకి ఉపయోగపడుతుందని చేశానని, దీనివల్ల వ్యక్తిగతంగా తనకు ఒరిగిందేమీ లేదని, పదవిని అడ్డుపెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించింది లేదని, కాంట్రాక్టులు చేసిం దీ లేదని ఆయన అన్నారు.

ఓటింగ్ రోజు తాను వెళ్లేసరికి ఆలస్యమైందని, దానివల్ల కొంపలారిపోయిందేమీ లేదని ఆయన తనను తాను సమర్థించుకున్నారు. తనకు కేంద్ర మంత్రి చిదంబరం బాగా తెలుసని కొందరు అంటున్నారని,చిదంబరమే కాదు.. ప్రధాని కూడా ఎంపీ కాకముందే నాకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. మొత్తం మీద, రాజీనామా చేసినప్పటికీ తానేమీ తప్పు చేయలేదనే భావనతోనే సుజనా చౌదరి ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+