తెలంగాణ భేటీ: చంద్రబాబుకు వరంగల్ టెన్షన్

ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ నెల 28వ తేదీనాటికి వరంగల్ జిల్లాలోకి చేరుకుంటారు. అఖిల పక్ష భేటీలో తెలంగాణకు అనుకూలంగా వైఖరి చెప్పాలని చంద్రబాబుపై ఇప్పటికే తెలంగాణవాదుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెల్లడిస్తుందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు చెబుతూ వస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా చంద్రబాబు వైఖరిపై అనుమానాలు చోటు చేసుకున్నాయి.
తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఏనాడూ మాట్లాడలేదని, మాట్లాడబోనని చంద్రబాబు తెలంగాణలోకి ప్రవేశించినప్పటి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి - తెలంగాణకు అనుకూలంగా తాము ప్రణబ్ ముఖర్జీకి గతంలో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని కూడా అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీపై ఉందంటూనే తాను ఓ అడుగు ముందుకు వేసినట్లు కనిపించారు. కానీ, అకస్మాత్తుగా ఇటీవల అందుకు విరుద్ధంగా మాట్లాడారు.
రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి తాను తెలంగాణపై అలా వ్యవహరిస్తే తప్పేమిటని అడిగారు. దీంతో చంద్రబాబు వైఖరిపై తెలంగాణ నేతల్లో గుబులు పట్టుకుంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెల్లడించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని అర్థమైంది. దీంతో వారిలో టెన్షన్ చోటు చేసుకుంది. అఖిల పక్ష భేటీలో తమ పార్టీ ప్రతినిధులు వ్యవహరించే తీరు వరంగల్ జిల్లాలో చంద్రబాబు చేసే పాదయాత్రపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళనకు గురవుతున్నారు.
చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేరనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు తెలంగాణ జెఎసి కూడా అంటోంది. తెలంగాణపై ఎందరు ప్రతినిధులు అఖిలపక్ష భేటీకి వెళ్లినా పార్టీ వైఖరిగా ఒక్క అభిప్రాయమే చెప్పాలని తెలంగాణ జెఎసి డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్‌తో తెలంగాణ జెఎసి ప్రతినిధులు కోదండరామ్ నేతృత్వంలో చంద్రబాబును కలిసే ఆలోచనలో ఉన్నారు. మొత్తం మీద, తెలంగాణపై చంద్రబాబు వైఖరి తెలంగాణ తెలుగుదేశం నాయకులను ఇరకాటంలో పెట్టేట్లుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications