వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త సిఎంపై సోనియా ఆరా, ఇక కిరణ్ ఇంటికేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Sonia Gandhi
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు జోరందుకున్న విషయం తెలిసిందే. పార్టీలో ఆయన పట్ల ఎన్నాళ్ల నుండో ఉన్న అసంతృప్త నేతలు ఆయనపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా చర్చ జరుగుతోందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతల రాజీనామాలతో ఖాళీ అయిన పద్దెనిమిది స్థానాలలో జరిగే ఉప ఎన్నికలకు ముందే కిరణ్ ఇంటికి వెళ్లనున్నారా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. సోమవారం శాసనసభ, శాసనమండలిలో ఏ ఇద్దరు అధికార పక్ష నేతలు ఎదురుపడ్డా రాష్ట్రంలో సిఎం మార్పు తథ్యమంటూ చర్చించుకున్నారట. ఈ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోందని పాలక పక్షంలోని పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారని అంటున్నారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు ఏకంగా విలేకరుల ఎదుటే సీఎం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు లోక్‌సభ సెగ్మెంట్‌కు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఓటమి పునరావృతమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం తథ్యమని పార్టీ నేతలు అంటున్నారు.

సిఎం కిరణ్‌ను తక్షణం మార్చాల్సిందేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కిరణ్ ఇలానే కొనసాగితే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదమని ఆయన అన్నారు. ఎన్నికల్లో టీం ఓడిపోయినందున కెప్టెన్‌ను మార్చాల్సిందేనని మాజీ మంత్రి శంకర్‌ రావు డిమాండ్ చేశారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కిరణ్‌పై మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఆ తరువాత పిఆర్పీ మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు కూడా భేటీ అయ్యారు. మరో వైపు డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహతోనూ పెద్దిరెడ్డి భేటీ అయ్యారు. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక విషయమై డిప్యూటీ సిఎం తన చాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సమావేశంలోనూ సిఎం తీరుపై కొందరు సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సిఎం మొదలుకొని మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు వరకు సిఎంగా కిరణ్ కొనసాగితే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో సిఎం అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ ఇప్పటికే రెండుగా చీలింది. అధిష్ఠానం కూడా కిరణ్ వ్యవహార శైలిపట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. తరచూ ముఖ్యమంత్రులను మార్చకూడదన్న విధానంతో ఉన్న సోనియా ఆలోచనలోనూ కిరణ్ విషయంలో మార్పు వచ్చిందని అంటున్నారు. త్వరలో జరగబోయే 18 శాసనసభా సెగ్మెంట్‌ల ఎన్నికల్లో తాజా ఉప ఎన్నికల ఫలితాలే వెలువడితే రాష్ట్రంలో కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా పోతుందన్న భయం అధిష్ఠానాన్ని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సంక్షోభాలను నివారించేందుకు కఠిన చర్యలను తీసుకోవడమే మందుగా అధిష్ఠానం భావిస్తోందని పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది? ఏ ప్రాంతానికి చెందిన వారైతే బాగుంటుంది? అంటూ అధిష్ఠానం ఆరా తీస్తోందని సమాచారం. దీంతో కాంగ్రెస్ నేతలు పలువురు తమ వాదన వినిపించేందుకు హస్తినకు వెళుతున్నారట. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఢిల్లీ వెళ్లాలని రాజనరసింహ నిర్ణయించుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారు.

English summary

 It seems, Kiran Kumar Reddy may replaced as CM soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X