'మంత్రులను వదల్లేక.. జగన్‌ను విడువలేక..'

ఎదురుదాడి చేయలేక బయటపడలేక ఇప్పుడు అధికార పార్టీ చిక్కుల్లో పడింది. జగన్ కేసులో సిబిఐ తన ఛార్జీషీటులో మంత్రుల పేర్లను ప్రస్తావిస్తోంది. దీంతో వారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిల పేర్లను సిబిఐ ప్రస్తావించింది. జగన్ కేసులో ఒక్కో చార్జిషీటు దాఖలయ్యే కొద్దీ మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
తాజాగా వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువైన కెవిపి రామచంద్ర రావు కూడా తమ స్కాన్‌లో ఉన్నట్లు మంగళవారం కోర్టుకు సిబిఐ ఇచ్చిన వివరణతో స్పష్టమైంది. ఒక్కో చార్జిషీటును జగన్‌పై అస్త్రాలుగా వాడుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ, ప్రతి చార్జిషీటులో తమ వారూ ఉండటంతో ఇరుకున పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌పై ఎదురుదాడి చేయలేక, తమ వాళ్లను పూర్తిగా సమర్థించుకోనూ లేక సతమతమవుతోంది. అసలు దీనిపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే అంశంపై లోతుగా చర్చ జరుగుతోంది.
సిబిఐ చార్జిషీటు దాఖలు చేసిందంటూ ఒక్కో మంత్రిని వదులుకుంటూ పోతే రాజకీయంగా బలహీన పడటం ఖాయం. వాళ్లను సమర్థించి తీరాల్సిన పరిస్థితి. అప్పట్లో మంత్రివర్గం సమష్టిగా తీసుకున్న నిర్ణయాలకు వీళ్లను బలి చేయడం అన్యాయమనే వాదన లేవనెత్తుతూ అప్పుడు ధర్మాన ప్రసాద రావునూ, ఇప్పుడు సబితా ఇంద్రా రెడ్డినీ వెనుకేసుకు వస్తున్నారు. అయితే... ఈ వైఖరి వల్ల సిబిఐ చార్జిషీట్లకు సంబంధించి జగన్‌పై బలమైన దాడి చేయలేకపోతున్నారు.
'జగన్ మాత్రమే నిందితుడు. మా వాళ్లు మంచి వాళ్లు' అని చెప్పడం చెల్లుబాటు కాదన్నది మరో అధికార పార్టీలోని మరో వర్గం వాదన! "ఫైళ్లపై సంతకాలు చేసినప్పుడు దానికి బాధ్యత అనుభవించాల్సిందే. దీని నుంచి తప్పించుకోలేరు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు జగన్ పార్టీయే. జగన్‌ను దోషిగా నిలబెడితే కాంగ్రెస్‌కు తిరుగు ఉండదు'' అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మంత్రులను సమర్థిస్తే జగన్‌కు తప్పించుకునే అవకాశం కల్పించడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న స్థితిలో, ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో సబితా ఇంద్రా రెడ్డి రూపంలో ఊహించని షాక్ తగిలింది.












Click it and Unblock the Notifications