కాపు వర్సెస్ రెడ్డి: కిరణ్ కుమార్ రెడ్డికి పొగ

2014 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెసుపై పూర్తి ఆధిపత్యం కోసం ఆ వర్గం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చిరంజీవి బహిరంగంగా విమర్శించడం, బొత్స సత్యనారాయణ కీలకమైన హోం మంత్రిత్వ శాఖను డిమాండ్ చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు, కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఒక్కటవుతున్నారని అంటున్నారు.
కాంగ్రెసులో రెడ్ల ఆధిపత్యమే సాగుతోందని, రెడ్లు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇస్తున్నందున కాపులకు నాయకత్వం వస్తేనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గట్టెక్కుతుందనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత బలాన్ని కూడగట్టుకుని, తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు మరో శిబిరానికి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఆ ప్రమాదాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు వ్యతిరేకంగా మరో శిబిరానికి మద్దతు ఇస్తున్న మంత్రుల నియోజకవర్గాలకు, మంత్రిత్వ శాఖలకు చెందిన నాయకులను, అధికారులను దగ్గరికి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా వారికి చెక్ పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. చిరంజీవి, బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం బలంగానే ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!