కెసిఆర్‌కు సిగ్నల్స్: తెలంగాణపై దిగ్విజయ్ మౌనం

ఈ నెల 5న లేదా 12న జరిగే మంత్రివర్గ సమావేశంలో టీ నోట్‌పై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ చేస్తున్న కసరత్తుపై మాత్రం బయటకు వార్తలు రావడంలేదు. కేంద్ర మంత్రి బలరాంనాయక్ మాత్రం ఈ నెల 12న కేంద్ర కేబినెట్ ముందుకు టీ నోట్ చర్చకు వస్తుందని ప్రకటించారు. మరోవైపు నోట్‌ను తయారుచేసే ప్రక్రియ ప్రారంభమైందని ఆదివారం వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణ ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల ఇది నమ్మాలా, వద్దా అనే సంశయంలో తెలంగాణవాదులు పడ్డారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజన అంశంపై గత కొన్ని రోజులుగా పెదవి విప్పక పోవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం, సిడబ్ల్యుసి నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించిన అనంతరం దిగ్విజయ్ ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై మీడియాతో మాట్లాడుతూ వచ్చారు. తెలంగాణ, సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు విభజన అంశంపై ఆయనను కలిసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై ఏపి మీడియాను ఆయనే స్వయంగా పిలిచి వివరించేవారు.
అయితే, గత కొన్ని రోజులుగా దిగ్విజయ్ మీడియాతో మాట్లాడకపోవడంలోని ఆంతర్యమేమిటనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. దిగ్విజయ్ ఏదైనా మాట్లాడారంటే అది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభిప్రాయంగానే రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలూ భావిస్తారు. ఒకవైపు తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ వద్దకు వచ్చే తేదీ దగ్గర పడుతుండటం, మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయినా ఆయన స్పందించకపోవడం విశేషం.












Click it and Unblock the Notifications