స్టింగ్‌తో డంగ్: చిరు తర్వాత శైలజనాథ్‌కు హరి క్లోజ్

Sailajanath - Hariprasad
బ్యాంకుల అక్రమ లావాదేవిలపై రహస్య ఆపరేషన్ చేస్తున్న కోబ్రో పోస్ట్ పాత్రికేయులకు మంత్రి శైలజానాథ్ దొరికిపోయారు. తిరుపతిలోని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో వారు పెట్టే నల్లధనానికి తాను హామీగా ఉంటానని పెద్దమనిషి హోదాలో భరోసా ఇచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని మంత్రి శైలజానాథ్ కొట్టి పారేశారు. ఇందులో హరిప్రసాద్ అనే వైద్యుడు పాత్ర కూడా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

మనీలాండరింగ్‌పై కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో శైలజానాథ్ పాత్ర ఉందనే వార్త ప్రకంపనలు రేపింది. కోబ్రాపోస్ట్ అధినేత, సీనియర్ జర్నలిస్టు అనిరుధ్ బహాల్ సోమవారం ఈ వ్యవహారాన్ని బయట పెట్టారు. కోట్లాది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడంలో సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కోబ్రాపోస్ట్ చేపట్టిన ఆపరేషన్ రెడ్ స్పైడర్-2 స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా దాని ప్రతినిధి మారుపేరుతో ఢిల్లీలోని ఇండియన్ బ్యాంక్ కార్యాలయానికి వెళ్లడంతో అసలు కథ మొదలైంది.

సదరు బ్యాంక్ శాఖలోని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనోహర్‌ను కోబ్రాపోస్ట్ ప్రతినిధి సయ్యద్ మస్రూర్ హసన్ కలుసుకున్నారు. తాను భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నానని, వెంటనే రూ.కోటి, తర్వాతి కాలంలో మరికొంత చొప్పున 25 కోట్ల వరకు భారీగా పెట్టుబడి పెడతానని బ్యాంకర్‌కి తెలిపారు. తనకు తెలిసిన ఓ రాజకీయ నాయకుడు (కోబ్రాపోస్ట్ కల్పిత నేత) కూడా తన భార్య పేరుతో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారని వివరించారు.

ఆయన ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్నారని కూడా మనోహర్‌ని హసన్ నమ్మించారు. ఇదంతా నల్లధనం అయినందున తమ పేర్లు బయటకు రావొద్దని చెప్పారు. దీంతో మనోహర్ నల్లధనాన్ని తెల్లధనం చేసేందుకు రకరకాల మార్గాల్ని సూచించాడు. లాకర్లలో కిలోల చొప్పున బంగారం దాచుకోవడం, నకిలీ పాన్ కార్డులు, బీమా పాలసీలు తీసుకోవడం, ఏడాది చివర్లో ఖాతాలు మూసి కొత్త ఏడాదిలో ఖాతాలు తెరవడం, రికరింగ్ డిపాజిట్‌లు చేయడం వంటివి వివరించాడు.

అయితే చివరకు మనోహర్‌కు మరో మార్గం తట్టింది. తనకు రియల్ ఎస్టేట్ డెవలపర్ తెలుసునని, అతడి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడితే చెక్ ద్వారా వడ్డీ వైట్‌మనీగా వస్తుందని, సెక్యూరిటీగా రూ.15 కోట్ల విలువైన ఆస్తి కూడా రిజిస్టర్ చేస్తాడని చెప్పాడు. దీంతో తిరుపతి నుంచి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హరి ప్రసాద్ రంగంలోకి దిగారు. ఆయన ఢిల్లీ వచ్చి మనోహర్, కోబ్రాపోస్ట్ ప్రతినిధిని అక్కడి అశోకా హోటల్‌లో రెండుసార్లు కలుసుకున్నారు.

ప్రసాద్ మాటల మధ్యలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా తెలుసునని చెప్పాడు. తర్వాత కోబ్రాపోస్ట్ ప్రతినిధిని హైదరాబాద్ తీసుకెళ్లి మొదట ఓ సీనియర్ మంత్రిని కలిపించాడు. ఆయన కూడా ప్రసాద్ ప్రాజెక్టులో పెట్టే సొమ్ముకు గ్యారంటీ ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ సాంకేతిక కారణాలవల్ల ఈ సంభాషణను రికార్డు చేయలేకపోయినట్లు కోబ్రాపోస్ట్ పేర్కొంది. తర్వాత సిబిఐ మాజీ అధికారిగా చెప్పుకున్న వాసు అనే వ్యక్తి కార్యాలయానికి ప్రసాద్, హసన్ వెళ్లారు.

తనకు పెద్ద వాళ్లంతా తెలుసునని, ఎక్కడికైనా హవాలా మార్గంలో డబ్బులు తరలించగలనని వాసు చెప్పుకొచ్చాడు. చైనా, ఇటలీ, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో తన వాళ్లున్నారని, చాలా మంది రాష్ట్ర మంత్రులు కూడా తనకు పరిచయమని తెలిపాడు. చివరకు కోబ్రాపోస్ట్ ప్రతినిధిని శైలజానాథ్ దగ్గరకు డాక్టర్ ప్రసాద్ తీసుకెళ్లారు. వచ్చీ రాగానే శైలజానాథ్.. ప్రసాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రసాద్ ప్రాజెక్టులో పెట్టే పెట్టుబడులకు గ్యారెంటీగా ఉంటానని చెప్పారట.

చట్ట వ్యతిరేక పనులు చేయను: శైలజానాథ్

తనపై వచ్చిన ఆరోపణలపై శైలజానాథ్ స్పందించారు. డాక్టర్ హరి ప్రసాద్ తన జూనియర్ అని, తక్కువ వడ్డీకి బ్యాంకు రుణం తీసుకుంటున్నానని చెప్పి మాటసాయం కోరాడని, బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఇబ్బందేమీ ఉండదని రాజేష్ అనే వ్యక్తికి చెప్పానని వివరణ ఇచ్చారు. తాను చట్ట వ్యతిరేక కార్యకలాపాలేవీ చేయలేదని.. చేయబోనని, నిబంధనలకు కట్టుబడిన వ్యక్తినని వివరణ ఇచ్చారు.

రాజేష్ ఏం చేస్తాడో తనకు తెలియదని, తన వద్దకు వచ్చినప్పుడు కూడా ప్రశ్నించలేదన్నారు. తనకు హైదరాబాద్ ఎస్‌బిహెచ్‌లో, అనంతపురం ఆంధ్రాబ్యాంకులో, కర్నూలులో మరో బ్యాంకులోనూ ఖాతాలున్నాయని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులెవరైనా తనపై కుట్ర పన్నుతున్నారనే కోణంలో ఆలోచిస్తున్నానన్నారు.

రుణం ఇస్తానంటే... హరి ప్రసాద్

ఆస్తుల తనఖాపై వ్యక్తిగత రుణం ఇస్తానంటే అందుకు ప్రయత్నించానే తప్ప మనీలాండరింగ్ విషయం తనకు తెలియదని హరి ప్రసాద్ తెలిపారు. వ్యాపార అవసరాల నిమిత్తం డబ్బు అవసరమై వ్యక్తిగత రుణం ఇస్తానంటే ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. అక్కడ ఆస్తుల తనఖాతో పాటు వ్యక్తిగత పూచీకత్తు కోరారని ఆ క్రమంలో తన సీనియర్ డాక్టర్ అయిన శైలజానాథ్ వద్దకు ఆ వ్యక్తిని తీసుకొచ్చానని అన్నారు. మాట సాయం చేసినందుకు మంత్రిపై కూడా నిందలు రావడం బాధాకరమన్నారు.

చిరు తర్వాత శైలజానాథ్‌కు దగ్గరైన హరి ప్రసాద్

డాక్టర్ హరి ప్రసాద్ 11 ఏళ్లుగా తిరుపతిలో వైద్య సేవలందిస్తున్నారు. అనంతపురం మెడికల్ కళాశాలలో చదివిన ఆయన 2008లో ఏర్పాటు చేసిన బోత్ హస్పిటల్‌ను చిరంజీవి ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తిరుపతి నుంచి చిరంజీవి గెలుపొందడంతో వీరి మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయి. అటు డాక్టరుగా, ఇటు ఎమ్మెల్యే చిరంజీవికి సన్నిహితుడిగా తిరుపతిలో పలుకుబడి పెరిగింది.

చిరంజీవి రాజ్యసభకు వెళ్లిన తరువాత ఈయన రాష్ట్ర మంత్రి శైలజానాథ్‌కు దగ్గరయ్యారు. అనంతపురం మెడికల్ కాలేజీలో శైలజానాథ్‌కు హరిప్రసాద్ జూనియర్. ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య సంబంధాలు బలపడ్డాయి. డాక్టర్‌గా నిలదొక్కుకున్న తరువాత హరిప్రసాద్ రియల్టర్‌గా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+