తెలంగాణ: చంద్రబాబు, జగన్ వ్యూహాత్మక మౌనం

చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా రెండు ప్రాంతాల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణకు అనుకూలమనో, వ్యతిరేకమనో వారు అనడం లేదు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే చర్చ ముందుకు వచ్చిన ప్రతిసారీ తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు సమైక్యనినాదం వినిపిస్తూ వచ్చారు. పయ్యావుల కేశవ్ వంటి నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చేవారు. కానీ, ఈసారి నోరు విప్పడం లేదు.
కాంగ్రెసు సీనియర్ నాయకుడు కావూరి సాంబశివరావు తన వైఖరి మార్చుకోవడంపై సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం మాట్లాడారు. పదవి రాగానే మాట మారిందని ఆయన కావూరి సాంబశివరావును అన్నారు. ఇతర నాయకులు మాట్లాడడం లేదు. తెలంగాణ నాయకులు కూడా విభజనపై వస్తున్న వార్తలపై స్పందించడం లేదు.
జరుగుతున్న పరిణామాలపై ఏమీ మాట్లాడవద్దని ఇరు ప్రాంతాల నాయకులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధిష్టానానికి తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని, నిర్ణయం వెలువరిస్తుందనే నమ్మకం లేదని చంద్రబాబు అంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా, తెలంగాణపై జరిగే నిర్ణయం ప్రభావం తమపై పడకుండా చూసుకునే వ్యూహంలో భాగంగానే ఆయన ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రాన్ని విభజించినా, మరే నిర్ణయం తీసుకున్నా దాని పూర్తి ప్రభావం కాంగ్రెసుపై మాత్రమే పడాలనే భావనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. దానివల్ల ఇరు ప్రాంతాల్లోనూ తమకు ప్రయోజనం కలుగుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, తాము తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని, తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రస్తుత తెలంగాణ పర్యటనల్లో అంటున్నారు. కానీ, తాజా పరిణామాలపై ఆమె మాత్రమే కాకుండా ఆమె పార్టీ నాయకులు కూడా ఎవరూ మాట్లాడడం లేదు.












Click it and Unblock the Notifications