జగన్ ఆపరేషన్: ముకుతాడు వేయడమే

పార్టీలో తొలుత చెల్లుబాటు అయినట్లుగా ఇప్పుడు తమ మాట చెల్లుబాటు కావడం లేదనే అసంతృప్తి కొండా దంపతుల్లో మొదలు కావడమే వివాదానికి కారణమని తెలుస్తోంది. పార్టీ తమను వదులుకుంటే నష్టపోతుందని, అందువల్ల పూర్తిగా తాము చెప్పినట్లుగా పార్టీ నాయకత్వం నడుచుకోవాలనే ఆధిపత్య ధోరణిని కొండా సురేఖ, ఆమె భర్త మురళి ప్రవర్తించారని అంటారు. అందుకే, ఏ మాత్రం వెనకాడకుండా కొండా దంపతుల అనుచరులపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. జగన్‌తో భేటీ తర్వాత అంతా సర్దుకున్నట్లు కనిపించింది. కానీ కొండా దంపతుల కోరికలేవీ తీరలేదని చెబుతున్నారు.
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వ్యవహారం నలుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత దాడి వీరభద్రరావును పార్టీలోకి తీసుకోవటం ఆయన బద్ధ శత్రువు కొణతాల రామకృష్ణకు నచ్చడం లేదు. తాను దాడి వీరభద్రరావుతో కలిసి పనిచేసేది లేదని కొణతాల రామకృష్ణ తెగేసి చెబుతున్నారు. కానీ పార్టీ నుంచి వెళ్లడానికి మాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. కొణతాల సోదరుడు లక్ష్మినారాయణ దాడి వీరభద్రరావుపై విరుచుకుపడుతున్నారు. కొణతాల రామకృష్ణ ఆధిపత్యానికి కళ్లెం వేయడానికి జగన్ దాడి వీరభద్రరావును వాడుకుంటున్నట్లు చెబుతుున్నారు.
పార్టీ పెట్టినప్పటినుంచి మాత్రమే కాకుండా అంతకు ముందు నుంచీ జగన్‌కు అండగా ఉంటూ వస్తున్న నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డికీ, ఆయన ప్రత్యర్థి కాకాని గోవర్ధన్‌రెడ్డికీ మధ్య ప్రారంభమైన పంచాయతీ జగన్‌కు మరో కొత్త తలనెప్పి తీసుకు వచ్చినట్టు భావిస్తున్నారు. కేవలం మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రమే కాదు, మిగతా నాయకులు కూడా ముఖ్యమేనని ఆచరణలో జగన్ చూపడం వల్లనే ఈ గొడవ మొదలైనట్లు చెబుతున్నారు. తాజాగా ఇటీవల జరిగిన రాజకీయ కమిటీ సమావేశానికి మేకపాటి హాజరయ్యారు.
మొత్తంగా, తాము జగన్‌కు దగ్గర అని, పార్టీలో తమ మాట మాత్రమే చెల్లుబాటు అవుతుందని ప్రచారం చేసుకుంటూ, ఆ వైఖరితో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న నాయకులకు కళ్లెం వేసే వ్యూహంతోనే జగన్ నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications