ఎందుకు పనికి రానా, స్మృతి వేధింపులు: రోహిత్ తల్లి
హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ తల్లి రాధిక కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులం నేపథ్యంలో స్మృతి తమను వేధిస్తున్నారని రాధిక ఆరోపించారు.
తాను ఎందుకు పనికి రాని వ్యక్తిగా స్మృతి భావిస్తున్నారని ఆరోపించారు. తన కులం పేరుతో తనను వేధిస్తున్నారన్నారు. కులం కారణంగానే తాను తన కొడుకు రోహిత్ వేములను పోగొట్టుకున్నానని చెప్పారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఇంకా తాను దళితురాలిని కానని నిరూపించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
తాను ఎస్సీని కానని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. తాను తీవ్ర ఆవేదనలో, బాధలో ఉన్నప్పుడు ఇలా చేయడం బాధాకరమన్నారు. ఈ దేశంలో ఏ దళిత మహిళకు కూడా చట్టపరంగా సమన్యాయం లభించడం లేదన్నారు. ఇతరుల్లా దళిత మహిళలను చూడటం లేదన్నారు.

కాగా, జనవరి 17వ తేదీన హెచ్‌సియులో వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తీవ్రవాది యాకూబ్ మెమెన్ ఉరిని వ్యతిరేకిస్తూ రోహిత్ వేముల, ఆయన సంస్థకు చెందిన సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు పడింది.
తీవ్రవాదులకు మద్దతు పలకడం ఏమిటని కొందరు ప్రశ్నించగా.. భావ ప్రకటనా స్వేచ్ఛ అని కొందరు.. మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు, రోహిత్ దళితుడని, ఆయనది ప్రభుత్వ హత్య అని విపక్షాలు ఆరోపించాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం.. ఆయన దళితుడు కాదని, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడని, అందుకు ఆధారాలున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications