ఎపి సహకారం: కెసిఆర్ వ్యతిరేకుల పనేనా?
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యతిరేక శక్తుల హస్తం ఉందని ప్రభుత్వానికి పోలీసు నిఘా వర్గాల నుంచి నివేదిక అందినట్టు సమాచారం. తెరాస ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఆందోళనకారులకు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నట్టు కూడా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళన వెనుక ముఖ్యమంత్రి కెసిఆర్‌ను వ్యతిరేకించే దళిత నాయకుడి హస్తంతో పాటు, ఎన్నికల ముందు టిడిపిలో చేరిన బిసి నాయకుని హస్తం ఉన్నట్టు నిఘా వర్గాలు తమ నివేదికలో పొందుపరిచినట్లు చెబుతున్నారు.

వీటితో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను స్థానికులకే వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న పొరుగు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కూడా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యతిరేక ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటున్నట్టు నిఘా వర్గాలు తమ నివేదికలో తెలిపినట్లు సమాచారం.
కాగా, విద్యార్థులకు కాంట్రాక్టు విద్యార్థులు విజ్ఞప్తులు చేస్తున్నారు. తమను చీకట్లోకి నెట్టవద్దని వారు విద్యార్థులను కోరుతున్నారు. దండం పెడుతూ తాము ఆ వినతి చేస్తున్నట్లు వారు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎన్నికల ప్రణాళికలో కూడా హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications