బెజవాడపై పురంధేశ్వరి కన్ను, అక్కడ కృష్ణంరాజు
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ లోకసభపై ఆసక్తి చూపిస్తున్నారట. 2009 ఎన్నికల్లో ఆమె విశాఖపట్నం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె ఇటీవలె కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె విజయవాడ నుండి పోటీ చేయాలను భావిస్తున్నారట. విజయవాడ లోకసభ స్థానానికి తన పేరును పరిశీలించాలంటూ పార్టీ ఎపి రాష్ట్ర ఎన్నికల కమిటీకి ఆమె దరఖాస్తు చేశారు.
మరోవైపు నరసారావుపేట లోకసభ స్థానానికి కూడా ఆమె దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. బిజెపి సీనియర్ నేత, ఎపి పార్టీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు విశాఖ నుండి బరిలో దిగనున్నారు. విజయవాడ లోకసభకు పురంధేశ్వరితో పాటు మరో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. నర్సాపురం నుండి రఘురామకృష్ణం రాజు, సినీ నటుడు కృష్ణం రాజుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

అయితే, కృష్ణంరాజుకు కాకినాడ స్థానాన్ని సూచించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నరసారావుపేట నుండి పురంధేశ్వరి, విష్ణు, అనంతపురం, హిందూపురం నుండి ఎన్టీ చౌదరి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, విష్ణువర్ధన్ రెడ్డి, ఏలూరు నుండి కోటగిరి శ్రీధర్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశాఖ సీటు కోసం గతంలో పురంధేశ్వరి కాంగ్రెసు నేత, రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామి రెడ్డితో పోటీ పడిన విషయం తెలిసిందే.
కీగీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి బిజెపి ఒక్కటే కృషి చేసిందని, అందుకే చేసింది, చేయాల్సింది చెప్పుకోవడానికి పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సీమాంధ్రలో పర్యటించాలని, అప్పుడే స్థానికుల్లో భరోసా ఏర్పడుతుందని హరిబాబు చెబుతున్నారు. సీమాంధ్రలోని 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఎప్పుడూ సమస్యలపై గళమెత్తలేదని, కానీ బిజెపి శాయశక్తులా కృషి చేసిందన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే సీమాంధ్రకు సాధించిన ప్యాకేజీలను అమలు చేస్తామని, ఇవి అమలవుతాయన్న భరోసాను సీమాంద్రుల్లో కలిగించాలంటే మోడీ సీమాంధ్రలో పర్యటించాలన్నారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నంలలో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, మోడీ ఆ సభలకు వస్తే సీమాంద్రుల్లో భరోసా కలుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications