వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రజ్యోతి కథనం: అది గవర్నర్ ఫిట్టింగ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించాలనే నిర్ణయం గవర్నర్ నరసింహన్ ఫిట్టింగ్ అంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. శుక్రవారం ప్రచురితమైన ఆ వార్తాకథనం తీవ్ర చర్చకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్‌ ఫిటింగ్‌ పెట్టింది గవర్నర్‌ నరసింహనేనా అని ప్రశ్నించి అవుననే సమాధానం చెప్పడానికి ఆ పత్రిక ప్రయత్నించింది.

ఆంధ్రజ్యోతి వార్తాకథనం ప్రకారం - రాష్ట్ర విభజన చట్టాన్ని తోసిరాజని, నరహింహన్ హయాంలో రాష్ట్రపతి పాలన సమయంలో జారీ చేసిన జీవోనే ప్రస్తుత వివాదానికి కారణమా!? ఈ ప్రశ్నలకు ‘ఔను' అనే అంటున్నారు ఏపీ అధికారులు. రాష్ట్ర విభజన చట్టంలోని ఒక సెక్షన్‌కు గవర్నర్‌ వక్ర భాష్యం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 72 (1)(2) కింద రవాణా పర్మిట్లకు సంబంధించి స్పష్టమైన వివరణ ఉంది. సెక్షన్‌ 72 (1) ప్రకారం.. అపాయింటెడ్‌ డే నాటికి చెల్లుబాటయ్యే పర్మిట్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రవాణా శాఖ అధికారులు జారీ చేస్తే.. ఆ పర్మిట్‌ వ్యాలిడిటీ (చెల్లుబాటు కాలం) ఉన్నంత వరకు ఉభయ రాషా్ట్రల్లోనూ అది చెల్లుతుంది. ఈ పర్మిట్‌పై ఏ రాష్ట్రమూ కౌంటర్‌ సైన్‌ (ప్రతి సంతకం) చేయాల్సిన అవసరం లేదు.

ఉభయ రాష్ట్రాలనూ సంప్రదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సవరణలు చేయవచ్చు. సెక్షన్‌ 72 (2) ప్రకారం.. అపాయింటెడ్‌ డేకి ముందురోజు వరకు ఉభయ రాష్ట్రాల్లో చెల్లుబాటయ్యే పర్మిట్‌ ఉన్న రవాణా వాహనాలకు సంబంధించి ఏ రాష్ట్రమూ టోల్‌ ఫీజు కానీ, ఎంట్రన్స్‌ ఫీజు కానీ, అలాంటి స్వరూప స్వభావాలున్న ఇతర చార్జీలను కానీ విధించకూడదు. ఆయా రాష్టాలను సంప్రదించి ఎంట్రన్స్‌ ఫీజు లేదా ఇతర చార్జీల విధింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వవచ్చు. విభజన చట్టంలో ఇంత స్పష్టంగా ఉంటే.. గవర్నర్‌ నరసింహన్‌ కొత్త ఫిటింగ్‌ పెట్టారు.

Report: Governor Narasimhan fitting

అపాయింటెడ్‌ డే అయిన జూన్‌ రెండో తేదీ వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అంటే అపాయింటెడ్‌ డేకి సరిగ్గా ముందు రోజున అంటే 2014 జూన్‌ ఒకటో తేదీన రాష్ట్రపతి పాలన సమయంలోనే ఒక జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ పేరిట ప్రభుత్వానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన లక్ష్మీపార్థసారథి దానిని జారీ చేశారు. ‘‘2015 మార్చి 31వ తేదీ వరకు ఏ రాష్ట్రానికి చెల్లించిన త్రైమాసికపు పన్ను అయినా, రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చెల్లించినా అది రెండు రాష్ట్రాలకూ చెల్లించినట్లే. ఆ తర్వాత ఇరు రాష్ట్రాలూ నిర్ణయం తీసుకుంటాయి'' అని జీవో జారీ చేశారు.

అదేరోజు జరిగిన గవర్నర్‌- ఇన్‌- కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ జీవో జారీ అయింది. విభజన చట్టంలోని 72(1) సెక్షన్‌ ప్రకారం గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలోని పర్మిట్‌ విధానం, పన్ను మినహాయింపులు ఆ తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని విభజన చట్టంలో స్పష్టం చేస్తే.. అపాయింటెడ్‌ డేకి ముందురోజు గవర్నర్‌ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా వివాదాస్పద జీవో జారీ చేశారు. పైకి చూడడానికి ఇది ట్రాన్స్‌పోర్టు యజమానులు 2015 మార్చి వరకు ఇరు రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉదారంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నా.. కాస్త లోతుగా ఆలోచిస్తే మాత్రం గవర్నర్‌ తనకు లేని అధికారాన్ని సొంతం చేసుకున్నట్లు స్పష్టమవుతుంది.

2015 మార్చి 31 తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చంటూ కొత్త భాష్యం చెప్పినట్లయింది. వాస్తవానికి, విభజన చట్టానికి గవర్నర్‌ వక్రభాష్యం చెప్పారని అధికారులు అంటున్నారు. చట్టంలోని సెక్షన్‌ 72(1)లో పర్మిట్‌ ఉభయ రాష్ట్రాల్లోనూ చెల్లుబాటు అవుతుందని, అందులో త్రైమాసిక పన్ను గురించి ప్రస్తావనే లేదని, కానీ దాని కోసమే గవర్నర్‌ జీవో జారీ చేశారని ఆరోపిస్తున్నారు.
గవర్నర్‌ జోక్యంతో వివాదాస్పదం
వాస్తవానికి, తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలు ఎంట్రీ టాక్సు కట్టాలని ప్రతిపాదించింది. ఈ అంశం అప్పుడే గవర్నర్‌ వద్దకు వెళ్లినా ఆయన స్పందించలేదు. దాంతో ట్రాన్స్‌పోర్టర్లు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో న్యాయస్థానంలో గవర్నర్‌ జారీ చేసిన జీవో నెంబరు 43 ప్రస్తావనకు వచ్చింది తప్పితే, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ప్రస్తావనకు రాలేదు.

రవాణా పన్నులకు సంబంధించి గవర్నర్‌ జీవో జారీ చేశారంటూ ట్రాన్స్‌పోర్టర్లు కూడా దానినే చూపించారు. దాంతో, 2015 మార్చి 31 వరకూ కొత్త పన్నులు ఏవీ విధించవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ గడువు ముగిసిపోవడంతో ఏప్రిల్‌ 1 నుంచి ఎంట్రీ ట్యాక్స్‌ విధిస్తూ టీ సర్కారు ఆదేశాలిచ్చింది. అపాయింటెడ్‌ డేకు ముందు ఉభయ రాష్ట్రాల్లోనూ చెల్లుబాటు అయ్యే పర్మిట్‌ ఉన్న వాహనాలకు ఏ తరహా ఫీజులు, చార్జీలు వసూలు చేయరాదని విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినా.. గవర్నర్‌ ఇచ్చిన జీవో అండతో పన్ను విధింపు అవకాశాన్ని చేజిక్కించుకుంది. విభజన చట్టంలో ‘పన్ను' విధించకూడదని ఎక్కడా లేదని, ఎంట్రన్స్‌ ఫీజు, ఇతర చార్జీలు అని మాత్రమే అని ఉన్నందున ఎంట్రీ ట్యాక్స్‌ విధించే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి సంక్రమించిందని అధికారులు వాదిస్తున్నారు. దాని ఆధారంగానే ఎలాంటి పన్నునైనా విధించే అధికారం తమ ప్రభుత్వానికి ఉందని హైకోర్టులోనూ వాదిస్తున్నారు.

విభజన చట్టంలోని అంశాలను అలాగే వదిలేసి ఉంటే కేంద్రం నిర్ణయం తీసుకుని ఉండేది. కానీ, గవర్నర్‌ అనవసర జోక్యంతో వ్యవహారం పీటముడిపడి సంక్లిష్టంగా మారిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రజ్యోతి వార్తాకథనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపైనే అందరూ చర్చించుకుంటున్నారు.

English summary
According to andhrajyothi daily - the entry tax on AndhraPradesh vehicle by Telangana government is a fitting of governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X