జగన్, పివిల ఉదంతాలు: ఆ పత్రిక టార్గెట్ చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారిక పత్రికగా పేరు పొందిన నమస్తే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని వార్తాకథనాలు ప్రచురిస్తోంది. ఎమ్మెల్యేను ప్రలోభపెట్టిన కేసులో అరెస్టయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉదంతాన్ని ఆసరా చేసుకుని నమస్తే తెలంగాణ దినపత్రిక చంద్రబాబుపై విరుచుకుపడింది. చంద్రబాబు నిందితుడే అంటూ ఆ పత్రిక మంగళవారంనాడు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఓటుకు పచ్చ పార్టీ నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకూడా నిందితుడవుతారా? ఈ కేసులో చంద్రబాబు తన సంబంధాన్ని తప్పించుకోలేరా? ఆయన పేరును ఏసీబీ తన చార్జిషీట్లో చేర్చుతుందా? గతంలో ఇటువంటి ఉదాహరణలేమైనా ఉన్నాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు వేస్తూ వాటిపై చర్చ జరుగుతోందని ఆ పత్రిక రాసింది. న్యాయనిపుణులు, ఇతర ప్రముఖుల అభిప్రాయాలను తన వార్తాకథనానికి అనుకూలంగా జోడించింది.
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో డీల్ గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తమ బాస్ అంటూ, బాబు అంటూ పలుమార్లు ప్రస్తావించిన విషయాలను ఉటంకిస్తూ చంద్రబాబుపై నమస్తే తెలంగాణ పత్రిక ఆ వార్తాకథనాన్నిప్రచురించింది. జెఎంఎం ముడుపుల కేసులో అప్పటి ప్రధాని పివి నరసింహారావు వ్యవహారాన్ని ఉటంకిస్తూ తమ వార్తాకథనానికి నమస్తే తెలంగాణ ప్రతిక బలం చేకూర్చుకునే ప్రయత్నం చేసింది.

జేఎంఎం ఎంపీల ముడుపుల కేసులో నాటి ప్రధాని పీవీ నర్సింహారావును సైతం ఈ విధంగానే కోర్టు బోనెక్కిన సందర్భాన్ని పలువురు నిపుణులు గుర్తు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరును పదేపదే తన సంభాషణల్లో రేవంత్ ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో బాబును నిందితుల జాబితాలో చేర్చేందుకు వందశాతం అవకాశాలు ఉన్నాయని పలువురు రిటైర్డ్ డీజీపీలు సైతం అభిప్రాయపడుతున్నట్లు ఆ పత్రిక వ్యాఖ్యానించింది.గతంలో జరిగిన అవినీతి కేసులలో సీబీఐ పాటించిన విధానాలను ఏసీబీ అనుసరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నదంటూ వ్యాఖ్యానించింది.
చంద్రబాబుపై తమ వాదనను సమర్థించుకోవడానికి నమస్తే తెలంగాణ పత్రిక సిబిఐ దర్యాప్తు ఉదంతాలను తెలియజేసింది. అవినీతి, అక్రమాలు, కుట్రలు తదితర కేసులను సీబీఐ చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంటుంది. దర్యాప్తు ముమ్మరం చేస్తూ.. మరిన్ని ఆధారాలు సేకరిస్తూ.. విచారణ సందర్భంగా నిందితులు ఇచ్చే సమాచారం మేరకు మరింత మంది పేర్లను చార్జిషీట్లలో చేరుస్తూ ఉంటుందని, వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులోనూ సీబీఐ ఇదే తరహాలో దర్యాప్తు కొనసాగించిందని గుర్తు చేసింది. ఆ కేసులో కొంతమంది మాజీ మంత్రుల పేర్లు ముందుగా ఎఫ్‌ఐఆర్‌లోకి రాలేదని, కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో సేకరించిన వాంగ్మూలాలు, జారీ అయిన జీవోలు, రికార్డుల ఆధారంగా అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తూ కొత్తగా కొందరి పేర్లు చేర్చిందని చెప్పింది. ఇదే తరహాలో రేవంత్‌రెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు సాగే అవకాశం ఉందని చెప్తున్నారంటూ వ్యాఖ్యానించింది.

సెక్షన్ 120(బీ) (కుట్ర), 34 (కుట్రలో అందరిదీ ఒకే ఉద్దేశం)లలో చంద్రబాబు కచ్చితంగా నిందితుడు అవుతారని తెలుస్తున్నది. పలువురు మాజీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారని చెప్చింది. మొత్తం నమస్తే తెలంగాణ దినపత్రిక చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని గత రెండు రోజులుగా వార్తాకథనాలను ప్రచురిస్తూ వస్తోంది. రాజకీయ వైరాల మధ్య పత్రికలు విడిపోయిన క్రమంలో ఇటువంటి వార్తాకథనాలు రావడం సహజమేనని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications