జానాకు ‘టీఆర్ఎస్’ రాజ్యసభ: పోట్లకు కాంగ్రెస్ ఖమ్మం ఆఫర్?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఎన్నికల వేళ వివిధ పార్టీల నాయకులు తమ, తమ వారసుల ఉజ్వల భవిష్యత్ కోసం పార్టీలు మారడం కద్దు. కానీ నూతన రాష్ట్రం తెలంగాణలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే ఈ సమీకరణల ప్రక్రియ మొదలైనట్లు కనిపిస్తున్నది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 'ఓటుకు నోటు' కేసులో చిక్కుకున్న మాజీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి 'హస్తం' పార్టీ గూటికి చేరుకోవడంతో తెలంగాణ గడ్డపై రాజకీయాల పునరేకీకరణ మొదలైందని తెలుస్తున్నది.

భవిష్యత్‌లోనైనా సీఎం కావాలని ఆశలు పెట్టుకున్న అసెంబ్లీ ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డికి రాజ్యసభ టిక్కెట్, ఆయన కొడుక్కి నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటు కేటాయిస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఇక మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్ రావుకు ఖమ్మం అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆశ చూపుతోంది.

అధిష్ఠానం వైఖరిపై గుంభనంగా కాంగ్రెస్ సీనియర్లు

అధిష్ఠానం వైఖరిపై గుంభనంగా కాంగ్రెస్ సీనియర్లు

ఎవరికి వారు ప్రజలకోసమే అని చెప్పుకుంటున్నా, అంతిమంగా తమ రాజకీయ భవిష్యత్ చూసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్‌పార్టీలోని కొంతమంది నేతలు గుర్రుగా ఉన్నారు. ఆయన వల్ల తమ ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళనగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిస్తే సీఎం పదవిని అధిష్టించొచ్చని ఆశించిన నేతలకు నిరాశ ఎదురైంది. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డికె అరుణ, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ, సునీత లక్ష్మారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి సుధాక ర్‌రెడ్డి వంటి సీనియర్‌ నేతలు గుంభనంగా ఉన్నారు. తాజాగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరడంతో, టీడీపీలో ఉన్న సీతక్క, నరేందర్‌రెడ్డి, విజయరమణా రావు వంటి నేతలు కూడా మూడు రంగుల జెండా కప్పుకున్న విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి చేరికతో తమ బలం పెరిగిందని కాంగ్రెస్‌పార్టీ సంబరపడి పోతున్న దశలో కొడంగల్‌ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌ నాయకత్వం తమ పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పింది.

రేవంత్, రేణుకతో పోట్ల చర్చలు

రేవంత్, రేణుకతో పోట్ల చర్చలు

టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెప్పడంతో ఆయన కాంగ్రెస్‌పార్టీలోకి చేరబోతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందే ఆయనతో పోట్ల నాగేశ్వర్ రావు రెండు దఫాలు చర్చలు జరిపారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి రంగంలోకి దిగి ఆయనతో సంప్రదింపులు జరిపారని వార్తలు వచ్చాయి. ముందుగా అధికార టీఆర్‌ఎస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకత్వంపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునే సత్తా గల వారితోనే కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చిస్తున్నారు.

పుట్టమధుతో కాంగ్రెస్ చర్చలపై దుద్దిళ్ల ఆగ్రహం

పుట్టమధుతో కాంగ్రెస్ చర్చలపై దుద్దిళ్ల ఆగ్రహం

వారిలో మాజీ మంత్రి డీకే అరుణ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలపై టీఆర్‌ఎస్‌పార్టీ నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలిసింది. వారు తమ పార్టీలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు కేటాయిస్తామని ఆశ చూపినట్టు ప్రచారం జరుగుతున్నది. దీన్ని వారు ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, దామోదర రాజనర్సింహ వచ్చినా టిఆర్‌ఎస్‌పార్టీ టికెట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలిసింది. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పుట్ట మధును తెచ్చేందుకు కాంగ్రెస్‌నేతలు చర్చలు జరపడంపై మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహంగా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ నేతలతో కాంగ్రెస్‌ చర్చలు

టీఆర్‌ఎస్‌ నేతలతో కాంగ్రెస్‌ చర్చలు

కాంగ్రెస్‌ పార్టీ కూడా టీఆర్‌ఎస్‌పార్టీలోకి కొంతమంది నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త, ఎమ్మెల్సీ కొండా మురళీ కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ నేతలు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా అందుకు చర్చలు జరుగుతున్నాయని ధ్రువీకరించారు. దీన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ ఖండించినా, ఆమె భర్త - ఎమ్మెల్సీ కొండా మురళీ మాత్రం చెప్పలేదు. ఎర్రబెల్లి దయాకరరావు, ఆయన సోదరుడు కూడా టీఆర్‌ఎస్‌‌లో చేరడంతో వరంగల్‌లో కొండా దంపతుల రాజకీయం తగ్గినట్టు ప్రచారం జరుగుతున్నది. మంత్రి పదవి ఇవ్వకపోవడం, వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లు కావాలని కోరితే టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం నిరాకరించడంతో కొండా దంపతులు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఇంకా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక మంత్రి పేరు బాగా వినబడుతున్నది. ఆయనతో చర్చలు తుది దశకు వచ్చాయని కాంగ్రెస్‌పార్టీ నేతలు అంటున్నారు. ఇంకా మరికొందరు మంత్రులతోనూ మాట్లాడినా, అందులో ఒకరు ఇప్పుడే ఎందుకు అని దాటవేసినట్టు తెలిసింది.

టీడీపీతో పొత్తు ఉంటే టీఆర్ఎస్ నుంచి వలసలు పక్కా?

టీడీపీతో పొత్తు ఉంటే టీఆర్ఎస్ నుంచి వలసలు పక్కా?

టీడీపీ నుండి బీజేపీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలోకి చేరుతున్నట్టు తెలిసింది. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ లేదని ప్రచారం జరుగుతుండడంతో ఆయన కూడా రాజకీయ భవిష్యత్ చూసుకుంటున్నారని సమాచారం. కానీ అధికారికంగా మాత్రం ఆయన తిరస్కరిస్తున్నట్లు వినికిడి. నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గం సీటును ఇవ్వడానికి కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ ఒకవేళ టీడీపీతో కలిసి పోటీ చేస్తే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు టికెట్లు వచ్చే అవకాశం లేదు. అటువంటి వారు కాంగ్రెస్‌ పార్టీలోకి జంపింగ్‌ చేస్తారని తెలుస్తోంది. 20 నుంచి 30 మందికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉండదని ప్రచారం జరుగుతుండడంతో వారంతా కాంగ్రెస్ పార్టీనో, బీజేపీనో చూసుకున్నారని అంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, సామాజిక న్యాయం వంటి నినాదాలతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు వాటికే చోటే లేకుండా పోయిందన్న చర్చ మేధావుల నుండి వినిపిస్తున్నది. ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి చేరినంత మాత్రాన సామాజిక న్యాయం ఎలా వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Political Polarisation in Telangana speed up with Revant Reddy joining in Congress party. Power Party TRS and Opposition Party Congress party leaders focus on TDP leaders and their rival parties. Particularly TRS focussed on Ex ministers DK Aruna, Sunita Laxma Reddy and others.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి