జగన్ నోరుజారారా? టిపై ఓటమిని ఒప్పుకోనని..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభాపతి నాదెండ్ల మనోహర్ పైన గురువారం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ ఉత్తర ప్రదేశ్ వెళ్లారు. అక్కడ జరిగిన విభజనను అధ్యయనం చేసేందుకు అక్కడి స్పీకర్‌ను కలిశారు. దీనిపై జగన్ ఎద్దేవా చేశారు.
లక్నో వెళ్లిన స్పీకర్‌ను ఒకటే అడగదలుచుకున్నానని, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించినప్పుడు లక్నోలో ఏం జరిగింది? అన్న కనీస అవగాహన మీకుందా? కనీసం ఆ మేరకు బుద్ధి, జ్ఞానమైనా మీకుందా? అక్కడికీ ఇక్కడికీ తేడా అర్థమవుతోందా? ఆరేళ్ల పిల్లాడిని అడిగినా చెబుతాడని జగన్ వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం చేశాకే అక్కడ విభజన జరిగిందని జగన్ చెప్పారు.

స్పీకర్ పైన జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. సభాపతి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే తాము సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి శుక్రవారం హెచ్చరించారు. సభాపతి పైన జగన్ వ్యాఖ్యలు అనుచితమని, అది సరికాదని పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు పదిహేను రోజుల క్రితం తాను ఓటమిని ఒప్పుకోనన్న జగన్ తాజాగా తమకు బలం తక్కువని, వాళ్ల మనసులు కరగాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, తాము దేవుడిపై భారం వేశానని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చామన్నారు.












Click it and Unblock the Notifications