మెగాస్టార్ చిరంజీవిపై మాయావతి చిందులేయడానికి కారణం వేరే ఉందట. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 6వ తేదీన వచ్చారు. ఆ సమయంలో చిరంజీవిని కలవాలని ఆమె అనుకున్నారని చెబుతున్నారు. అలా కలవడం ఉభయతారకంగా ఉంటుందని ఆమె ఎత్తు వేశారట. తండ్రిని కోల్పోయిన చిరంజీవికి సానుభూతి తెలియజేయాలని, అదే సమయంలో రాజకీయ ప్రవేశంపై చిరు మనోగతమేమిటో తెలుసుకోవాలని ఆమె భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎత్తులను చిరంజీవి చిత్తు చేశారని అంటున్నారు. అందుకే ఆమె చిరంజీవిపై తోక తొక్కిన పాములు బుస్సుమన్నదని వినికిడి. సినీ తారలకు ప్రజాసేవ చేయడం చేతకాదని, వారికి డ్యాన్సులు చేయడం మాత్రమే తెలుసునని ఆమె బహిరంగసభలో ప్రకటించి చిరంజీవిపై తన కసిని తీర్చుకున్నారట.