న్యూఢిల్లీ: రాష్ట్రంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గీయుల వ్యవహారంపై కాంగ్రెసు పార్టీ అధిష్ఠానం రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. జగన్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం శిరోధార్యమంటూనే తన అనుచరులను రెచ్చగొడుతున్నారని పార్టీ అధిష్ఠానం భావించినట్లు సమాచారం. దీనివల్లనే మంత్రి కొండా సురేఖ వంటివారు ముఖ్యమంత్రిగా రోశయ్య నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడాన్ని, రాజీనామాలు చేస్తామని కొంత మంది శాసనసభ్యులు బెదిరింపు ధోరణిలో మాట్లాడడాన్నిఅధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన కెవిపి రామచందర్ రావు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి చెందిన నాయకులు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీలను కలవడానికి ప్రయత్నం చేశారు. ఆయన వారితో భేటీ కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. రాష్ట్రంలో జగన్ వర్గీయులు బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని పార్టీ జాతీయ నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఇదే విషయాన్ని కెవిపి రామచందర్ రావుకు చెప్పినట్లు సమాచారం. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరి కాదని వారన్నట్లు చెబుతున్నారు. దీంతో వైయస్ జగన్ దిగి వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన శుక్రవారం కడపకు వచ్చి సోనియా మాతృసమానురాలని ప్రకటన చేశారు. తన విధేయతను చాటుకుని, తిరిగి సోనియా విశ్వాసాన్ని చూరగొనాల్సిన పరిస్థితిలో జగన్ పడ్డారని అంటున్నారు. రాష్ట్రాన్ని ఓ వైపు వరదలు ముంచెత్తుతుండగా జగన్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సోనియాను ప్రశంసలతో ముంచెత్తారు. రాహుల్ ప్రధానిని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏమైనా, జగన్ పై అధిష్టానానికి ఏర్పడిన వ్యతిరేకత అంత తొందరగా తొలిగేది కాదనే మాట వినిపిస్తోంది.