దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద యెత్తున కుట్ర జరుగుతోందనే ప్రచారం ముమ్మరమైంది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సంభవించిన మరణాలపై జాతీయ మీడియాలో వార్తలు రావడాన్ని అందుకు నిదర్శనంగా చూపుతున్నారు. వైయస్ మరణానంతరం సంభవించిన సహజ మరణాలను కూడా వైయస్ ఖాతాలో వేశారని వార్తలు వచ్చాయి. దీంతో జగన్ శిబిరంలో తీవ్ర కలవరం మొదలైంది. జాతీయ స్థాయిలో కుట్రకు పాదులు పడ్డాయనేది ఆ కలవరానికి కారణమని అంటున్నారు. కాంగ్రెసు అధిష్ఠాన వర్గం మనస్సు మార్చడానికి జాతీయ మీడియాను ప్రత్యర్థులు ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఆ వార్తకు సంబంధించిన పత్రికా ప్రతులు ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో గుట్టు చప్పుడు కాకుండా వేసి పోయారని అంటున్నారు. జగన్ పై కుట్ర చేయడానికి ఎవరు పూనుకుంటారనే విషయానికి మాత్రం సమాధానం లేదు. రాష్ట్రానికి చెందిన పలుకుబడి గల నాయకులే దానికి ఒడిగట్టి ఉండవచ్చునని మాత్రం అంటున్నారు. దానికి విరుగుడుగా జగన్ వర్గం ముందుకు వచ్చినప్పటికీ అది సరిపోవడం లేదు. జగన్ వర్గానికి చెందిన మంత్రులు ఆ వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్సా సత్యనారాయణ ఆ వార్తలపై రుసరుసలాడారు. రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాద రావును ప్రత్యేకంగా ఈ విషయం మీదనే జగన్ కు చెందిన సాక్షి టీవి చానెల్ ఇంటర్వ్యూ చేసి మాట్లాడించింది. అంతా సవ్యంగా జరిగిపోతుందని భావిస్తున్న తరుణంలో పార్టీ అధిష్ఠాన వర్గం నాన్చుడు ధోరణి, పెరుగుతున్న వ్యతిరేక వార్తాకథనాలు జగన్ వర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని అంటున్నారు.