దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సోమవారం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో బహిరంగంగా వ్యక్తమైంది. జగన్ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఆయన అసహనం వ్యక్తం చేస్తూ మైక్ ను కట్ చేశారు. ఆయన జగన్ వ్యవహారం గురించి మాట్లాడడానికి ఏ మాత్రం ఇష్టంగా లేరు. జగన్ కు ప్రాధాన్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం లేదు. తాను చేసిన ప్రకటనపై వైయస్ సంతాప సభలో జగన్ వర్గీయులు చేసిన అల్లరి ఆయనను తీవ్రంగా బాధపెట్టినట్లు చెబుతున్నారు. ఇది ఒక రకంగా బెదిరించి నోరు కట్టేయడం వంటిదని ఆయన భావిస్తున్నారట. ఈ సంఘటన పార్టీ అధిష్ఠాన వర్గం వద్ద జగన్ కు వ్యతిరేకంగా పని చేసినట్లు చెబుతున్నారు. జగన్ వర్గం ఇప్పుడే ఇంత ఆధిపత్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఇక ముఖ్యమంత్రి అయితే ఆ వర్గాన్ని కట్టడి చేయడం సాధ్యం కాదని, తమ మనుగడకే ముప్పు వస్తుందని చాలా మంది రాష్ట్ర కాంగ్రెసు నాయకులు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే, వారు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఏ మాత్రం ఇష్టంగా లేనట్లు తెలుస్తోంది. జగన్ నాయకత్వంలో పని చేయాల్సి వస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఒక వర్గం అధిష్టాన వర్గానికి చెప్పినట్లు సమాచారం. దీన్ని పార్టీ అధిష్ఠాన వర్గం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు.