ముఖ్యమంత్రి వ్యవహారంలో కాంగ్రెసు నేత కె. కేశవరావు అత్యుత్సాహం ప్రదర్శించారనే వ్యాఖ్య వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చి ఆయన హైదరాబాదులో హల్ చల్ సృష్టించారు. ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి ఆయన మంతనాలు జరిపారు. తానే హైకమాండ్ అనే పద్ధతిలో వ్యవహరించారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు కదా అని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని, సీనియర్ కాంగ్రెసు నేత జి. వెంకటస్వామిని కలిశారు. ఈ సమయంలో కేశవరావు చేసిన ప్రకటనలు కూడా జగన్ వర్గానికి పుండు మీద కారం చల్లినట్లయింది. దాంతో పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు బహిరంగంగానే ఆయనపై విరుచుకు పడ్డారు. అధిష్టానం సందేశాన్ని మోసుకొచ్చినట్లు ఆయన ప్రదర్శించుకున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు. అయితే జగన్ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదని, తాను ఈ విషయంలో ఏమీ మాట్లాడబోనని గురువారం అన్నారు. తనకు మాలిన ధర్మానికి పోతే ఇలాగే అవుతుందని మరోసారి ఆయనకు అనుభవం ద్వారా తెలిసి వచ్చినట్లుంది.