టీవీ-5 చానల్ ప్రసారం చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి ప్రమాద కథనం తీవ్ర విమర్శలకు గురైంది. ఆ చానల్ యజమాని రికార్డు ఏ మాత్రం బాగుండలేదన్న విషయం ఇప్పుడు పోలీసుల పరిశోధనలో బయటపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ యజమానికి ఇంత నీచమైన కథనం ప్రసారం చేసుకోమని సలహా ఇచ్చిన రాజకీయ నాయకులు ఎవరా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ దుకాణాలకు, రిలయెన్స్ ఫ్రెష్ దుకాణాలకు మధ్య పోటీ ఏర్పడిందని, బాబే ఈ కథనానికి ప్రోత్సహించారని ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు ఇలా ప్రోత్సహించి ఉంటారనడానికి మరో కథనం కూడా విన్పిస్తోంది. తెలంగాణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించి పరువు తీసుకున్న ఆయన ఆ సమస్య వెనుక దారి పట్టేలాగా ఈ ఇష్యూను ముందుకు తెచ్చి ఉంటారన్న విమర్శలు కూడా లేకపోలేదు.
ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న జగన్ వర్గమే ఈ కథనాన్ని తన సాక్షి చానల్ లో కాకుండా మరో చానల్ లో వచ్చేలా చేశారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి అంటే జనంలో ఇప్పటికీ ఎంతో అభిమానం ఉందని కాంగ్రెస్ హై కమాండ్ గుర్తించేలా ఇలా చేసినట్టు ప్రత్యర్ధి పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. రోశయ్యను దించేసి జగన్ కు సిఎం పదవి ఇచ్చేలా చూసేందుకే ఇలా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆ టీవీ చానల్ చేసింది అనైతికమని అందరూ ముక్త కంఠంతో ఘోషిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి