వైయస్ జగన్ భయంతోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రైతు సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. రైతు సమస్యలపై ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో తాను 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని వైయస్ జగన్ ప్రకటించారు. ఈ ప్రకటన సోమవారం రాత్రి 9 గంటలకు వెలువడింది. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని అంటున్నారు. రాత్రికి రాత్రి ఆయన పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపారు. రైతుల క్రెడిట్ వైయస్ జగన్ కొట్టుకుపోతే తనకు జరిగే నష్టంపై చంద్రబాబు ఆందోళనకు గురయ్యారని అంటున్నారు. వైయస్ జగన్ కన్నా ముందు ఉండాలనే ఉద్దేశంతో రాత్రికి రాత్రి చంద్రబాబు తన ప్రకటన వెలువరించారు. రైతు సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 17వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని చంద్రబాబు సంచలన ప్రకటన వెలువరించారు. వైయస్ జగన్ కన్నా తానే ముందుండాలనే ఉద్దేశంతో తేదీని ముందుకు జరిపారని వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకుల మధ్య పోటీ అయినా రైతులకు మేలు చేస్తే మంచిదనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వినిపిస్తోంది.