కోస్తాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి హల్ చల్ చేయడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కాంగ్రెసేతర పార్టీలకు నచ్చిట్లు లేదు. కాంగ్రెసుతో చెలిమికి అంగీకరించిన తర్వాత చిరంజీవిపై వామపక్షాలు గుర్రుమంటున్నాయి. చిరంజీవితో స్నేహం చేయడానికి ఉవ్విళ్లూరిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు ఒళ్లు మరీ మండిపోతున్నట్లుంది. చిరంజీవిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పగటి వేషాలు వేయవద్దని, ఆందోళనలు చేసి ఎండలో మాడిపోవద్దని నారాయణ చిరంజీవికి సలహా ఇచ్చారు. ప్రధానికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే ధరలు తగ్గించేస్తారని ఆయన చిరంజీవికి సలహా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని తనకు హామీ ఇచ్చినట్లు చిరంజీవి గతంలో చెప్పుకున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని నారాయణగారు ఆ సలహా ఇచ్చారు. పైగా, చిరంజీవి కోస్తాంధ్రలో ఆందోళనలు చేసి బలం పెంచుకుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కాకుండా కాంగ్రెసు పార్టీకి లాభించే అవకాశం ఉండడంతో నారాయణ మరీ మండిపోతున్నట్లున్నారు.