కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి మరింత దగ్గరైనట్లు కనిపిస్తున్నారు. సమైక్యరాగం ఆలపిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కళా పరిషత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ విషయం బయటపడింది. టాలీవుడ్ కు చెందిన టాప్ యాక్టర్లందరూ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజాకు మోహన్ బాబు టిప్స్ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. మోహన్ బాబును చిరంజీవి సత్కరించారు. ఈ సమయంలో మోహన్ బాబుకు శాలువా కప్పి చిరంజీవి ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇరువురి మధ్య ఇంతకు ముందు పచ్చగడ్డి వేస్తే భగ్గమనేది. ఇద్దరు కూడా గతంలో విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఇటీవలి కాలంలో వారిద్దరు సన్నిహితం కావడానికి ప్రయత్నిస్తున్నారు. సుబ్బరామిరెడ్డి కార్యక్రమం వారిని మరింత దగ్గర చేసిందని అంటున్నారు.