సినిమాల్లో మెగా హీరో అయినా రాజకీయాల్లో మరుగుజ్జుగా మారిపోయిన చిరంజీవికి ఇప్పుడు చెప్పుకోడానికి ఓక "విజయం" దొరికింది. తెలంగాణపై కొంతకాలం ఎటూ తేల్చుకోకేక ఆయన సామాజిక తెలంగాణను విడిచిపెట్టి సమైక్యాంధ్ర వైఖరి తీసుకున్నారు. దీనివల్ల తెలంగాణలో ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను వ్యతిరేకించే పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఇప్పట్లో ఆ సినిమాల విడుదల లేదు కాబట్టి ఆ తర్వాత పరిస్ధితులు ఎలా ఉంటాయో చూడాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతికి రైల్వే మంత్రి మమతా బెనర్జీ కొత్తగా 8 రైళ్ళను ప్రకటించడంపై చిరంజీవి శిబిరం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇది నిజంగా తమ నాయకుడి కృషి ఫలితమేనని వారు అంటున్నారు.
చిరంజీవి ఈ రైళ్ళు ప్రారంభించాలని బడ్జెట్ కు ముందు మమతా బెనర్జీకి లేఖరాశారట. చిరంజీవి మీద ఆమె మమత చూపించి ఈ రైళ్ళను ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రమైన తిరుపతికి వచ్చే యాత్రికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే మమత ఈ మంచి పని చేసినట్టు కన్పిస్తోంది. ఇందులో చిరంజీవి గొప్పతనమేమీ లేదని, ఒక ఎమ్మెల్యే లేఖ మీద ఇంత పెద్ద పనులు జరగవని కాంగ్రెస్ ఎంపీ చింతా మోహన్ మనుషులు అంటున్నారు. చింతామోహన్ మమతా బెనర్జీని అనేకసార్లు కలుసుకుని ఈ పనులు చేయించారని వారు చెబుతున్నారు. తాను చేసిన కృషిని చింతామోహన్ కూడా పత్రికా ముఖంగా వివరించారు. మరి చిరంజీవి ఏమంటారో?
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి