కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తీవ్ర కసరత్తే చేశారు. మరో వైపు స్పీకర్ బోపయ్య సహకరిస్తున్నారు. యెడ్యూరప్పపై గతంలో కత్తులు నూరిన గాలి సోదరులు ఇప్పుడు ప్రభుత్వానికి తమ అండదండలు అందిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డిలపై రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ గుర్రుగా ఉన్నారు. గతంలో వారిపై ఆయన రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. తనకే అధికారం ఉంటే వారిని తాను పదవుల నుంచి తొలగించి ఉండేవాడినని కూడా వ్యాఖ్యానించారు. గాలి సోదరుల విషయంలో యెడ్యూరప్ప ప్రభుత్వంతో భరద్వాజ్ పోరాటమే చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో గాలి సోదరులపై వేటుకు భరద్వాజ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. వారిపై అనర్హత వేటు వేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారట. లాభదాయక పదవుల్లో ఉన్నారంటూ వారిపై వేటు అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ, భరద్వాజ్ ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది సందేహమే.