ఓదార్పు యాత్రపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని వేడుకున్నట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్ర వరకే తన ఇష్టప్రకారం వ్యవహరిస్తానని, మిగతా అన్ని విషయాల్లో పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాను పావురాలగుట్ట సాక్షిగా వాగ్దానం చేసినందున మాట తప్పకుండా ఉండడానికి ఓదార్పు యాత్ర చేపడుతున్నట్లు, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని జగన్ విషయంలో సోనియా గాంధీ కట్టడి చేశారు. దీంతో జగన్ ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించినట్లు భావిస్తున్నారు. అయితే, ప్రణబ్ ముఖర్జీ జగన్ విజ్ఞప్తికి ఏ మాత్రం సానుకూలంగా ప్రతిస్పందించలేదని అంటున్నారు. అసలు వ్యవహారమంతా సోనియా చేతుల్లోకి వెళ్లిపోయిందని అంటున్నారు. జగన్ వ్యవహారశైలి పట్ల సోనియా గుర్రుగానే ఉన్నారని తెలుస్తోంది. జగన్ పై సోనియా కరుణిస్తే తప్ప లాభం లేదనే మాట వినిపిస్తోంది.