పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డికి హోం మంత్రి పదవిపైనే మనసు పీకుతున్నట్లుంది. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల దీక్ష విరమింపజేసే సమయంలో ఆయన చేసిన డ్రామా ఈ విషయాన్ని పట్టిస్తోంది. విద్యార్థులపై కేసులు ఎత్తేసే విషయంపై హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పాల్సిన విషయాలన్నీ ఆయనే చెప్పేశారు. దీక్షా శిబిరానికి చేరుకున్న వెంటనే ఆయన మైక్ కోసం తహతహలాడారు. సరే, పెద్దాయన కదా అని సబితా ఇంద్రారెడ్డి జానారెడ్డికి మైక్ ఇవ్వాలని సూచించారు. మైక్ అందుకున్న జానా రెడ్డి అంతా మాట్లాడేసి సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చేశారు. దాంతో ఆయన ఆగలేదాయన. మైక్ తీసుకుని మాట్లాడుతుండగా సబితా ఇంద్రారెడ్డి నుంచి జానా రెడ్డి మైక్ లాక్కున్నంత పని చేశారు. దానికి సబితా ఇంద్రారెడ్డి తెగ ఆశ్చర్యపోయి అవాక్కయినంత పని చేశారు. తిరిగి మైక్ ఇచ్చేసి ఓ బిక్క చూపు చూశారు. తాను మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి జానారెడ్డి సబితా ఇంద్రారెడ్డికి మైక్ ఇచ్చారు. పాపం, ఓ రెండు ముక్కలు మాట్లాడేసి ఆమె ఊరుకుంది. దాంతో మన జానారెడ్డి ఆగలేదు. విద్యార్థులకు ఆ తర్వాత హెచ్చరికలు కూడా చేశారు. కేసులు ఎత్తేశామని మళ్లీ విధ్వంసాలకు దిగితే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించి వదిలేశారు. ఏమైనా, పాత వాసనలు ఆయనకు పోలేదంటున్నారు.