ముసాయిదా ప్రకటించే వరకు అది కెసిఆర్ ను దెబ్బ తీయడానికే ముందుకు వచ్చిందని అభిప్రాయం ఉంటూ వచ్చింది. కెసిఆర్ కు పోటీగా తయారు చేయాలని ఆంధ్రజ్యోతి దినపత్రిక చేసిన ప్రయత్నం కూడా విఫలమైనట్లే కనిపిస్తోంది. ఎన్నికలను ఓ పోరాట రూపంగా గుర్తించి ఎన్నికల్లో పాల్గొనాలనే వర్గం వాదన వీగిపోయింది. గద్దర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఎన్నికల్లో పాల్గొనే విషయాన్ని పక్కన పెట్టింది. దాంతో కెసిఆర్ పంట పండినట్లే. ఎన్నికలనే ప్రధాన పోరాట రూపంగా తీసుకున్న కెసిఆర్ కు అది పూర్తి ఊరటను కలిగించే విషయం. కెసిఆర్ విఫలమయ్యారని భావించిన ప్రతిసారీ గద్దర్ తెలంగాణను ఎజెండాగా చేసుకుని ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే రూపంలో వచ్చారని అనుకోవచ్చు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వడానికి గడువు దగ్గర పడుతుండడంతో దానిపై అంతగా నమ్మకం లేని వర్గం తెలంగాణ ప్రజా ఫ్రంట్ నిర్మాణ రూపాన్ని తీసుకుందని భావించవచ్చు. డిసెంబర్ లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయాలనేది గద్దర్ వ్యూహం కూడా కావచ్చు. ప్రస్తుతం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉద్యమం తీరు కెసిఆర్ కు ప్రయోజనకారిగానే ఉండేట్లుంది. అయితే, కెసిఆర్ పై అది తీవ్రమైన ఒత్తిడి కూడా పెట్టనుంది. ఆ ఒత్తిడి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేదిగా ఉంటుందని భావిస్తున్నారు. ఏమైనా, కెసిఆర్ హాయిగా తన ఉద్యమాన్ని కొనసాగించవచ్చు.