ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించే కనీస సంప్రదాయాన్ని కూడా వైయస్ జగన్ పాటించలేదనే వ్యాఖ్య సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ లో మరో విషయం బయట పడింది. కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినా వైయస్ జగన్ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదట. కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే వైయస్ జగన్ కట్ చేశారని, మాట్లాడడానికి ఇష్టపడలేదని మంత్రి దానం నాగేందర్ తాజాగా వెల్లడించారు. వైయస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలోనే కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ కు ఫోన్ చేశారని దానం నాగేందర్ సాక్ష్యం కూడా చూపించారు. వైయస్ జగన్ మాట్లాడడానికే ఇష్టపడకపోతే తామేం చేస్తామని ఆయన అన్నారు. తనకు దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవిని కిరణ్ కుమార్ రెడ్డి తన్నుకుపోతే వైయస్ జగన్ కు ఆ మాత్రం కోపం ఉండడంలో అర్థం ఉందని అంటున్నారు.