కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ ముందుచూపుతో అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ నుంచి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు హార్డ్ కోర్ సపోర్టర్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి శిష్యులు తెలంగాణలో చాలా మందే ఉన్నప్పటికీ మిగతా వారు పెద్దగా జగన్ వెంట నడిచేందుకు సిద్ధంగా లేరు. పార్టీ అధిష్టానం అంతరంగం అర్థం కావడంతో జగన్ కు దూరమవుతున్నారు కూడా. సురేఖ మాత్రం మడమ తిప్పడం లేదు, వెనకడుగు వేయడం లేదు. జగన్ ఆంతరంగికుల్లో ఒకరిగా ఆమె వ్యవహరిస్తున్నారు. వైయస్ ప్రథమ వర్ధంతి సెప్టెంబర్ 2వ తేదీన వైయస్ జగన్ తన సొంత పార్టీని ప్రకటిస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ పార్టీలో ఆమె ప్రధామైన నాయకురాలిగా ఉంటారనడంలో సందేహం లేదు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో కూడా పార్టీకి మనుగడ అవసరమనేది వేరే చెప్పక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జగన్ పార్టీకి కొండా సురేఖ నాయకత్వం వహించే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణలో ఆమెకు మించిన నాయకులు జగన్ కు లేకపోవడం, అధిష్టానం హెచ్చరించినా వెనకడుగు వేయకపోవడం, మంత్రి పదవిని త్యాగం చేయడం ఆమెకు ప్లస్ పాయింట్స్ అవుతాయని అంటున్నారు.