రాష్ట్ర రాజకీయాల్లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పేరెత్తితే కారాలు మిరియాలు నూరే స్వర్గీయ ఎన్టీ రామారావు భార్య లక్ష్మీపార్వతి వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబుపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ దించేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి లక్ష్మిపార్వతి చంద్రబాబును తన ప్రథమ శత్రువుగానే భావిస్తున్నారు. చంద్రబాబుతో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ను అభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబేనని ఆమె అన్నారు. ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని తాను 1996లో కోరానని, దాంతో చంద్రబాబు దాన్ని అభివృద్ధి చేశారని, అది ఇండో అమెరికన్ ఆర్గనైజేషన్ గా రూపు దాల్చిందని, ప్రస్తుతం అది ప్రపంచంలోనే మంచి ఆస్పత్రిగా రూపు దిద్దుకుందని ఆమె వివరించారు. లక్ష్మిపార్వతి మాటల్లో నిజమే ఉండవచ్చు గానీ ఇంత హఠాత్తుగా చంద్రబాబుపై అంత సానుకూలత వ్యక్తం చేయాల్సిన అవసరం లక్ష్మిపార్వతికి ఎందుకు వచ్చిందనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది.