తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై గుండె మంటతో ఉన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగకు మార్గం దొరికినట్లే ఉంది. గద్దర్ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. తెరాసను దొరల పార్టీగా ఆయన అభివర్ణించారు. కెసిఆర్ ను వ్యతిరేకిస్తున్న మందకృష్ణ తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ నాయకత్వం కోసం జరుగుతున్న పోరులో ఆయన ముందు వరుసలో ఉండాలని భావిస్తున్నారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో ఆయన కెసిఆర్ పై దుమ్మెత్తి పోసి తెరాసకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో దళితులు ముందున్నారని, వారే ఉద్యమానికి బలవుతున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఆగ్రకులాలైన వెలమ, రెడ్ల చేతుల్లో ఉందనేది మందకృష్ణ మాదిగ అభిప్రాయం. కెసిఆర్ సొంత ప్రయోజనాల కోసం ఉద్యమం నడుపుతున్నారని ఆయన విమర్శించారు. మొత్తం మీద, మందకృష్ణ మాదిగ గద్దర్ ఫ్రంట్ ను పూర్తిగా సమర్థిస్తూ తన రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేసుకునే అవకాశం ఉంది.