కేంద్ర మంత్రి పురంధేశ్వరిని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ టార్గెట్ చేసుకుంది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా పని చేసిన ఆమెను దెబ్బ తీయడంపై సాక్షి చానెల్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు అర్థమవుతోంది. జిల్లాకు ఓ వైయస్ విగ్రహం మాత్రమే ప్రతిష్టించాలనే పురంధేశ్వరిపై ప్రజలు మండిపడుతున్నారని అంటూ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. స్థానిక ప్రజలతో మాట్లాడించింది. ప్రకాశం జిల్లా పర్చూరు శాసనసభ్యుడు, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై కూడా సాక్షి టీవీ చానెల్ నిప్పులు చెరిగింది. తమకు శాసనసభ్యుడే లేడనుంకుంటామంటూ ఓ వ్యక్తి అన్న మాటలను సాక్షి ప్రసారం చేసింది. ప్రకాశం జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో శాసనసభ్యులను కట్టడి చేయడంలో పురంధేశ్వరి ప్రధాన పాత్ర పోషించారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కలిసి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్లి జగన్ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి లేదని అనిపించుకుని వచ్చారు. ఆ తర్వాత ఒక శాసనసభ్యుడు తప్ప మిగతా వారంతా జగన్ ఓదార్పుకు దూరంగా ఉండిపోయారు. దీంతో సాక్షి టీవీ చానెల్ పురంధేశ్వరిని వదిలిపెట్టడం లేదు. సమయం దొరికితే చాలు పురంధేశ్వరిపై సాక్షి టీవీ చానెల్, పత్రిక విరుచుకుపడుతున్నాయి.