ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచి తెలుగు ప్రజల ఒంటిని పులకరింపజేసిన శ్రీరామచంద్ర ఇక తెలుగుకు దూరం కావచ్చుననే చేదు నిజాన్ని కూడా జీర్ణం చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఐడల్ లో దక్షిణాది నుంచి విజయం సాధించిన తొలి కళాకారుడిగా కూడా శ్రీరాం కీర్తిని కొట్టేశాడు. ఇండియన్ ఐడల్ విజేతగా విజయం సాధించక ముందు నుంచే హిందీ సినీ ప్రపంచం నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఇప్పటికే ఓ సినిమాకు పాటను రికార్డు చేశాడు. యశ్ రాజ్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇక ఆయన హిందీ సినిమాలతోనే బిజీగా మారిపోయే అవకాశం ఉంది. శ్రీరాం గొంతు, ఆ గొంతులో పలుకుతున్న మాధుర్యం హిందీ సినీ ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ధర్మేంద్ర లాంటి హిందీ పెద్దలు ఆయనను మహ్మద్ రఫీతోనూ అశోక్ కుమార్ తోనూ పోల్చారు. ఈ స్థితిలో ఆయనను హిందీ సినిమా వదిలేట్లు లేదు. ఇండియన్ ఐడల్ విజేతగా అవతరించిన తర్వాత ఎప్పుడు ప్రత్యక్షంగా శ్రీరాంను చూద్దామా అని తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పుడు హైదరాబాదు వస్తానో తనకే తెలియదని శ్రీరాం ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. చాలా పనులు పూర్తి చేయాల్సి ఉందని, వాటిని పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ వస్తానని, తనకు కూడా హైదరాబాదును ఎప్పుడు చూద్దామా అని ఉందని అన్నాడు. తెలుగువాడు, మనవాడు ఒక్కడు హిందీ ప్రపంచాన్ని ఏలుతున్నాడని గర్వపడే స్థితికి శ్రీరాం చేరుకుంటాడని ఆశిద్దాం.