తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ఫ్యాక్టర్

తెలంగాణాపై తమకే చిత్తశుద్ధి ఉందంటూ జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ నేతలు, శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వక పోవడం, కేంద్ర హోంమంత్రి చిదంబరం చేత డిసెంబర్ 9, అలాగే 23వ తేదీన పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయించడం ద్వారా వేర్పాటు వాదంపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లం చేశారన్న అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో ప్రధానంగా చర్చనీయాంశం చేయాలను కుంటోంది. ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న స్థానాలు తమ పార్టీవి కాకపోయినా..రాజకీయంగా తన ప్రత్యర్థి కాంగ్రెస్ పోటీ చేస్తోందన్న ఏకైక కారణంతో తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల సంకుల సమరంలో తలపడాలనుకుంటోంది.
ఈ క్రమంలోనే పోటీ చేసే అంశంపై అధినేత చంద్రబాబు గత మూడు రోజులుగా ఆయా నియోజకవర్గాల నేతలతో సుదీర్ఘ మంతనాలు, సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ గనుక పోటీ నుండి తప్పుకుని అమరుల కుటుంబీకులకు అవకాశం కల్పిద్దామని ముందుకు వస్తే తాము ఈ అంశాన్ని పరిశీలించి పూర్తిగా సహకరించేందుకు ఏ మాత్రం అభ్యంతరం లేదన్న సంకేతాలను ఇప్పటికే టిడిపి ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. ఏతా వాతా ఉప ఎన్నికల్లో పోటీపై తమ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రాకుండా అదే సమయంలో 'తెలంగాణా" ఉప ఎన్నికల బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టి వేస్తూ తమ చేతికి మట్టి అంటకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడుతోంది.












Click it and Unblock the Notifications