• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్ కు టెర్రర్!

By Santaram
|

Hitech City
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంది. నగరానికి ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు అందడంతో నగర పోలీసు విభాగం అప్రమత్తమైంది. దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రధాన నగరాలకు, సముద్ర తీర ప్రాంతాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇటీవల కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గత కొన్ని రోజులుగా అప్రమత్తంగా ఉన్న పోలీసులకు సోమవారం సాయంత్రం నగరంలో ఉగ్రవాదుల సంచారంపై రహస్య సంకేతాలు అందడంతో నిఘాను పటిష్టం చేశారు. నగర సెక్యూరిటీ విభాగం అధికారులు రంగంలో దిగారు.

హైదరాబాద్ నగరంతో పాటు సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఉన్న హైటెక్ సిటీ, సాఫ్ట్‌ వేర్ సంస్ధలకు భద్రత కట్టుదిట్టం చేశారు. రాత్రి నాకాబందీ చేయడంతో పాటు పోలీసు అధికారులంతా నిత్యం రోడ్లపై కనిపించే విధంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదుల కదలికలు నగరంలో ఉన్నట్లు సమాచారం ఉండడంతో ఆక్టోపస్, మరో వైపు టాస్క్ఫోర్సు, నగర సెక్యూరిటీ విభాగం అధికారులను రంగంలో దించారు. సినిమా హాళ్ళు, ఐమాక్స్ థియేటర్లు, భారీ షాపింగ్ మాల్స్, జన రద్దీ ఉండే అన్ని ప్రాంతాలు, శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను పెంచారు. ఉగ్రవాదులు నగరంలోని ప్రధాన వాణిజ్య కూడలి అయిన బేగం బజార్ ప్రాంతంలో సోమవారం రెక్కీ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.

అనుమానస్పద వ్యక్తులు ఎవరు వచ్చినా, కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని మైకుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. నగరంలో గతంలో జరిగిన ఉగ్రవాద సంఘటనలు, సరిగ్గా మూడేళ్ళ కిందట జరిగిన మక్కా పేలుడు ఘటన, ఉగ్రవాది వికారుద్దీన్ అహ్మద్ రాకపోకలు, ముషీరాబాద్ ప్రాంతంలో ఇటీవల జీహాదీ శిక్షణ ఇచ్చినట్లు సమాచారం వెల్లడి కావడంతో ఉగ్రవాదుల సంచారం పెరిగిందనే అనుమానం బలపడింది. ఈ అంశాల దృష్ట్యా పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. సిమితో పాటు 12 ఉగ్రవాద సంస్ధలకు చెందిన స్లీపర్ సెల్స్ నగరంలో పని చేస్తున్నట్లు గతంలో పోలీసులే నిర్ధారించారు. నగరంలో అదును చూసి విధ్వంసం సృష్టించేందుకు ఇవి కుట్రపన్నుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా ఉన్నా స్లీపర్ సెల్స్ వాటి పని అవి చేస్తున్నాయి. తాజాగా బేగం బజార్‌లో రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ కదలికలను నిఘా విభాగం పోలీసలు పసిగట్టినట్లు సమాచారం. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. నగరానికి ఉగ్రవాద ముప్పు, టార్గెట్ ఎప్పటి నుంచో ఉందని, దానిలో భాగంగా తనిఖీలు, రహస్య పరిశోధన తప్పని సరి అని నగర అదనపు పోలీస్ కమీషనర్ తిరుమలరావు చెప్పారు. మాకు ఉన్నతాధికారుల నుంచి వచ్చే సమాచారంతో దీనిపై నిత్యం అనే్వషణ జరుగుతుందని చెప్పారు. నగరం మొత్తం రాత్రుళ్ళు నాకాబందీ చేపట్టడం ద్వారా అసాంఘిక శక్తులకు చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుందని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా నగరంలోని అమీర్‌పేటలో ఉన్న సత్యం థియేటర్‌ కు బాంబు బెదిరింపుఫోన్ ‌కాల్ వచ్చింది. అగంతకుడు థియేటర్‌లో బాంబు పెట్టామని, అది ఏ క్షణంలో అయినా పేలుతుందని హెచ్చరించాడు.

ఈ సమాచారం అందుకున్న బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ వెంటనే రంగంలో దిగింది. థియేటర్ అంతా తనిఖీ చేసి చివరకు బాంబు లేదని నిర్ధారించుకున్నారు. అలాగే కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు కూడా ముప్పు ఉందని భావించిన పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల నాటికి మక్కా మసీదులో బాంబు పేలుళ్ళు జరిగి మూడేళ్ళు పూర్తవుతున్నందున ఏ క్షణంలోనైనా దాడులు పాల్పడేందుకు అవకాశం ఉందని పోలీసులు ఇప్పటి నుంచే అప్రమత్తమయ్యారు. పేలుళ్ళ సందర్భంగా నిరసన వ్యక్తం చేసినప్పుడు పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని ముగ్గురు మృతికి దారి తీసింది. ఇందుకు ప్రతీకారంగానే ఉగ్రవాది వికారుద్దీన్ ఫలక్‌నుమా ప్రాంతంలో పట్టపగలు కాల్పులకు తెగబడ్డారు. మళ్లీ ఇప్పుడూ అదే ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X