కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సొంత పార్టీ పెడతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతిలో జరిగే వైయస్ సంస్మరణ సభలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయినా వైయస్ జగన్ ఒక్క మాటా మాట్లాడడం లేదు. అవునని గానీ కాదని గానీ ఆయన చెప్పడం లేదు. ఆయన ముఖ్య అనుచరుడు అంబటి రాంబాబు మాత్రం జగన్ పార్టీ పెట్టబోరని చెబుతున్నారు. పార్టీ పెడతారనే ప్రచారాన్ని ఎందుకు ఖండించడం లేదని ప్రకాశం జిల్లా కాంగ్రెసు శాసనసభ్యులు వైయస్ జగన్ ను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం చెప్పలేదు. శాసనసభ్యులు వేసిన ప్రశ్నలకు వేటికీ సమాధానం ఇవ్వలేదు. నాతో వస్తారా, లేదా తేల్చుకోండి అని మాత్రమే చెప్పారు. ఒక రకంగా ఆయన శాసనసభ్యులను కించపరిచే విధంగానే వ్యవహరించారని చెప్పవచ్చు. తన భవిష్యత్తు వ్యూహమేమిటో చెప్పకుండా తనతో నడవాలని ఆయన జబర్దస్తీ చేస్తున్నట్లు అనిపించకమానదు. పార్టీ పెడతారనే ప్రచారాన్ని ఖండించకపోవడం వల్ల జగన్ మదిలో పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉందని అనిపించక మానదు. జగన్ కు అది తప్పదేమో.