రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనక తిరుగులేని శక్తిగా ఎదిగిన కెవిపి రామచందర్ రావు ఇప్పుడు ఎక్కడున్నారనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. కాంగ్రెసుపై వైయస్ జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమస్యలతో సతమవుతున్న తరుణంలో ఆయన కనిపించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాకుండా రోశయ్య హయాంలో కూడా ఆయన తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన అవినీతిపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ మాత్రమే కాకుండా కాంగ్రెసులోని కొంత మంది నాయకులు కూడా తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు ఎక్కడి నుంచి వచ్చిందనే కనీస ఆలోచన కూడా చేయకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఓ విందు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే, తాను కాంగ్రెసులోనే ఉంటానని స్పష్టం చేసి, దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్న తన కుమారుడి వద్దకు వెళ్లిపోయారని సమాచారం. అయితే, మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు ఆయనను సంప్రదిస్తూనే ఉన్నారని సమాచారం.