ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మిపార్వతికి కోపమొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పై ఆమె మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను చిన్న పిల్లవాడిలాగా ఇంతకు ముందు అభివర్ణిస్తూ వచ్చిన లక్ష్మీపార్వతి ఇప్పుడు ఎందుకు పళ్లు నూరుతున్నారనేది ప్రశ్న. జూనియర్ ఎన్టీఆర్‌ను ఆమె అహంకారిగా అభివర్ణించారు. అహంకారాన్ని తొలగించుకుని స్వర్గీయ ఎన్టీ రామారావు నటనను అధ్యయనం చేస్తే అందులో పదో వంతైన జూనియర్ ఎన్టీఆర్ కు అబ్బుతుందని ఆమె అన్నారు. మరోవైపు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకు వైయస్ జగన్ మాత్రమే సాటి రాగలరని ఆమె కితాబు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తన చిరకాల ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడికి జూనియర్ ఎన్టీఆర్ తన పెళ్లి ద్వారా దగ్గర అవుతున్నారు. దానివల్లనే లక్ష్మీపార్వతికి జూనియర్ ఎన్టీఆర్‌పై కోపం వచ్చినట్లు భావిస్తున్నారు.