తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని ఏకాకిని చేసి బయటకు పంపించి వేయాలనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహం ఎదురు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబు వ్యూహాన్ని దెబ్బ తీయడానికి సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. తనను పార్టీ నుంచి పంపించి వేస్తే తన తెలంగాణ ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని నాగం జనార్దన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పొమ్మనలేక చంద్రబాబు పొగ పెట్టారు. తనకు అత్యంత సన్నిహితులైన పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను నాగం జనార్దన్ రెడ్డిపైకి ఎగదోశారు. నాగం జనార్దన్ రెడ్డి వెనక్కి తగ్గకపోగా, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన శాసనసభ్యుల తీరుకు ఆయన గట్టిగానే సమాధానమిచ్చారు. తెలంగాణపై చంద్రబాబు పేరెత్తకుండానే పార్టీ వైఖరిని తెలియజేస్తూ, పార్టీ వైఖరికి భిన్నంగా నడుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. దీంతో నష్టనివారణ కోసం చంద్రబాబు నాగం జనార్దన్ రెడ్డితో సంధి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సంధి ప్రయత్నాలు ఫలించినట్లే ఫలించి మళ్లీ బెడిసికొట్టాయి. దానితో పాటు కొత్త సమస్య వచ్చి పడింది. నాగం జనార్దన్ రెడ్డిని బుజ్జగించినందుకు ఆగ్రహించిన తెలంగాణకు చెందిన మరో పార్టీ శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి రాజీనామా చేసినట్లు సమాచారం. దయాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్ కార్యాలయంలో సమర్పించినట్లు చెబుతున్నారు. దీంతో తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు అయింది చంద్రబాబు పరిస్థితి.
It is said that TDP president Chandrababu strategy to defame and attack Nagam janardhan Reddy is reversed. It is said that Chandrababu plan against Nagam janardhan reddy is failed.
Story first published: Friday, March 11, 2011, 14:53 [IST]