ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు గుర్రుమంటున్నారట. తనకు దక్కాల్సిన పిసిసి అధ్యక్ష పదవిని బొత్స ఎగరేసుకుపోయాడని ఆయన కోపమని అంటున్నారు. బొత్స సత్యనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని విహెచ్ అంటున్నారు. కానీ ఆ మాటలను ఎవరూ నమ్మడం లేదు. పిసిసి అధ్యక్ష పదవికి తెలంగాణకే దక్కుతుందని, అది తన ఖాతాలోనే చేరుతుందని విహెచ్ గట్టిగా నమ్మినట్లు చెబుతున్నారు.
విహెచ్‌కు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వంటి సీమాంధ్ర నాయకుల మద్దతు కూడా లభించినా ఫలితం దక్కలేదు. విహెచ్ ఒకటి తలిస్తే కాంగ్రెసు అధిష్టానం మరోటి తలిచింది. దాంతో విహెచ్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు విహెచ్ ఆ కోపాన్నంత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మీద చూపించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.