వరుస పరిణామాల నేపథ్యంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావును మరిచిపోయే పరిస్థితి వచ్చింది. చాలా కాలంగా కెవిపి పేరు వినిపించడం లేదు. ఆయన ఎక్కడా మీడియాలో కనిపించడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా ఆయన తన వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ కెవిపి రామచందర్ రావును దుయ్యబడుతూ ఓ బహిరంగ లేఖ రాశారు. అప్పటి నుంచి కెవిపి సైలెంట్ అయిపోయారు. అప్పటి వరకు కెవిపి రామచందర్ రావు కాంగ్రెసుతో ఉంటూ వచ్చారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కెవిపి తన భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా ప్రముఖంగా కనిపించడం లేదు. కెవిపి రామచందర్ రావు కాంగ్రెసు వైపు ఉండకుండా చేయడానికే సురేఖ బహిరంగ లేఖాస్త్రం సంధించినట్లు చెబుతున్నారు. కొండా సురేఖ కెవిపి రామచందర్ రావుపై చేసిన ఆరోపణలను వైయస్ జగన్ వర్గానికే చెందిన కొంత మంది ఖండించడం కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఈ సందిగ్ధ స్థితిలో మౌనంగా ఉండడమే మేలని కెవిపి భావించి తెరవెనక్కి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.