వైయస్ జగన్ పేరెత్తని చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినా, శిక్షణా కార్యక్రమాలు చేసినా వైయస్ జగన్‌ను విమర్శించకుండా ముగించని ఆనవాయితీ ఉంటూ వచ్చింది. ఉప ఎన్నికల ప్రచారంలో అయితే వైయస్ జగన్‌పై విమర్శలే ప్రధానంగా ఉండేవి. అయితే ఉప ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు, ఆయనకు అనుగుణంగా పార్టీ నాయకులు వ్యూహం మార్చేశారు.
తాము జగన్ గురించి పదే పదే మాట్లాడటం, ఎక్కువగా విమర్శలు చేయడం వల్ల జగన్ రాజకీయాల్లో ఎదిగిపోతున్నాడని, ఇలాంటి విమర్శల వల్ల చివరకు తమకే నష్టం జరుగుతుందని తెలుగుదేశం నాయకత్వం భావిస్తోంది. సమీక్షా సమావేశాల్లో ఇదే నిర్ణయానికి వచ్చారు. దాంతో ఇకపై ప్రజల సమస్యలు ప్రధానంగా రైతుల సమస్యలపై ఉద్యమించాలని, జగన్‌ను పెద్దగా పట్టించుకోనట్టుగానే ఉండాలని నిర్ణయించారు.
వైయస్ జగన్ పేరునే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పేరును కూడా చంద్రబాబు ఎత్తలేదు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాకు చంద్రబాబు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చారు. ఒంటి గంటకు అరగంట పాటు ఉపన్యసించారు. రైతుల గురించి గతంలో చెప్పిన విషయాలే చెప్పినప్పటికీ ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించలేదు. ఇతర నాయకులు సైతం తమ ఉపన్యాసాల్లో జగన్ పేరును ప్రస్తావించలేదు.












Click it and Unblock the Notifications