బంగారు తల్లీ నాదేనంటున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే ఈ పథకం ద్వారా సహాయం అందజేస్తారు. దీనికి ఆయన చట్టబద్దత కూడా కల్పిస్తున్నారు. ఈ స్థితిలో ఆ పథకం కూడా తన ఆలోచనలోంచి పుట్టిందేనని చంద్రబాబు చెబుకుంటున్నారు. దీనిపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆ పథకం తనదేనని చెప్పడాన్ని శుక్రవారం విజయవాడ కాంగ్రెసు నాయకులు తప్పు పట్టారు.
కాంగ్రెసు శాసనసభ్యుడు ఎం. విష్ణు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రకటనలకు, చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు ఏ మాత్రం పొంతన లేదని ఆయన అన్నారు. మచిలీపట్నం ఓడరేవు అవసరం లేదని చంద్రబాబు గతంలో చెప్పారని, తాను అధికారంలోకి వస్తే దాన్ని పూర్తి చేస్తానని ఇప్పుడు అంటున్నారని ఆయన అన్నారు.
తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల వైపు కూడా చూడలేదని, పులిచింతల, పోలవరం ప్రాజెక్టులవంటి వాటిని నిర్మించడానికి ముందుకు రాలేదని, ప్రతిపక్షంలోకి రాగానే మాటలు మార్చారని ఆయన అన్నారు. చంద్రబాబు ద్వంద్వవైఖరికి ఇది అద్దం పడుతుందని విష్ణు అన్నారు.












Click it and Unblock the Notifications