ఎన్టీఆర్ భయం: లోకేష్ ఎంట్రీకి బాబు మాస్టర్ ప్లాన్?

అందరినీ ఆశ్చర్యపరుస్తూ నారా లోకేష్‌ను పోటీకి దించకూడదని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. చంద్రగిరి నుంచి నారా లోకేష్‌ను పోటీకి దించితే, గెలవడం కష్టం కావడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ గొడవ పెంచవచ్చునని ఆయన భయపడుతున్నారట. ఎన్నికల సమయంలో అనవసరమైన వివాదానికి తెర తీసి, పార్టీ నష్టం కలిగేలా వ్యవహరించినట్లు అవుతుందని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు నారా లోకేష్‌ను శానససభలోకి తేవడానికి మాత్రం కట్టుబడే ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి మాత్రమే కాకుండా శేర్‌లింగంపల్లి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారట. రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచిన తర్వాత చంద్రబాబు కుప్పం సీటును తన కుమారుడి కోసం ఖాళీ చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కుప్పం నుంచి నారా లోకేష్ బరిలోకి దిగుతారని అంటున్నారు. దానివల్ల ఏ విధమైన ఇబ్బంది లేకుండా లోకేష్ శాసనసభలోకి అడుగు పెట్టడానికి వీలవుతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ తెర వెనకనే పనిచేస్తారని అంటున్నారు. పార్టీ పరిస్థితిపై ఎన్నికల సమయంలో ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టుకుంటూ పరిశీలిస్తూ స్థానిక నాయకులకు తగిన సూచనలు ఇవ్వడం వంటి పనులు నారా లోకేష్ చేస్తారని అంటున్నారు. ఏమైనా, వ్యూహరచనలో చంద్రబాబుకు మరెవరూ సాటి రారని చెప్పాలేమో..












Click it and Unblock the Notifications